కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం | Gen Z Redefines Office Culture Respect Now Earned by Clarity Not Titles | Sakshi
Sakshi News home page

కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం

Apr 23 2026 8:56 AM | Updated on Apr 23 2026 9:06 AM

Gen Z Redefines Office Culture Respect Now Earned by Clarity Not Titles

బాస్‌లు కంట్రోల్ చేయడం కంటే కలిసి నడవడమే ముఖ్యం!

మారుతున్న ఆఫీస్‌ కల్చర్‌..

బాస్ అంటే భయం లేదు.. పనిలో స్పష్టతకే ఓటు!

జెన్‌జీ తీరు ఇదే..

టెక్నాలజీలో వేగంగా మార్పులొస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఆఫీసుల్లో కొత్తగా చేరే ఉద్యోగుల తీరు విభిన్నంగా ఉంది. గతంలో బాస్ ఏదైనా చెబితే చాలా వరకు ఎదురు చెప్పకుండా దాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు యువత ముఖ్యంగా జెన్ జీ తీరు మారింది. ఇది పని పట్ల వారికున్న కొత్త ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. వారిలోని మార్పును నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం.

హోదాను చూసి కాదు..

ఒకప్పుడు ఆఫీసులో ఎవరైనా పెద్ద పోస్టులో ఉంటే వారు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు సీన్ మారింది. కార్యాలయాల్లో ఇంటర్నల్‌ మీటింగ్స్ జరిగినప్పుడు ‘ఈ పని ఎందుకు చేయాలి?’ అని యువ ఉద్యోగులు అడుగుతున్నారు. కేవలం మేనేజర్ అని గౌరవం ఇవ్వడం కాకుండా తనకు విషయం తెలిసి స్పష్టంగా సమస్యను, పరిష్కారాన్ని వివరిస్తేనే నిజమైన గౌరవం దక్కుతోంది. అంటే, అధికారం అనేది ఇప్పుడు కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టి వస్తోంది.

పనిలో క్లారిటీ ఉండాల్సిందే!

‘నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల కంపెనీకి లేదా నాకు వచ్చే లాభం ఏంటి?’ అని జెన్‌జీ యువత ఆలోచిస్తున్నారు. పని గురించి సరిగ్గా వివరించకపోతే ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఇది తిరుగుబాటు కాదు, అర్థం లేని పని చేయలేక వస్తున్న విసుగు అని గమనించాలి. మనం చేసే పనికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉందని తెలిస్తేనే నేటి ఉద్యోగులు ఉత్సాహంగా పని చేస్తున్నారు.

అప్పటికప్పుడు ప్రోత్సాహం కావాలి!

పాత కాలంలో ఏ ఏడాదికో ఒకసారి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పటి డిజిటల్ కాలంలో అంత ఓపిక ఎవరికీ లేదు. ‘నేను చేస్తున్న పని బాగుందా? లేదా?’ అని ఉద్యోగులు అప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బాస్ ఏమీ చెప్పకుండా గమ్మున ఉంటే.. అది తమకు ఇష్టం లేదనో లేదా తనను పట్టించుకోవడం లేదనో ఉద్యోగి ఫీలవుతున్నారు. చిన్న మెచ్చుకోలు అయినా సరే అది పనిని రెట్టింపు వేగంతో చేయిస్తుంది.

జీతం కోసం మాత్రమే కాదు!

నేటి తరం పనిని కేవలం నెల నెలా వచ్చే జీతం కోసం చేయడం లేదు. వారు చేసే పనిలో ఒక తృప్తిని వెతుక్కుంటున్నారు. ‘నేను చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నేను ఎదగడానికి ఇది పనికొస్తుందా?’ అనేదే వారి మెయిన్ పాయింట్. అందుకే ఇప్పుడు ఆఫీసుల్లో కంట్రోల్ చేయడం కంటే ఉద్యోగులతో కలిసి ప్రయాణించడం ముఖ్యం. బాస్‌లు ఆదేశాలు ఇచ్చే వారిగా కాకుండా దారి చూపే వారిగా మారినప్పుడే ఏ కంపెనీ అయినా సక్సెస్ అవుతుంది.

ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Advertisement
 
Advertisement
Advertisement