టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు | Donald Trump Hails Tim Cook as Apple Greatest Leader Surpassing Steve Jobs | Sakshi
Sakshi News home page

టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు

Apr 22 2026 7:36 PM | Updated on Apr 22 2026 7:46 PM

Donald Trump Hails Tim Cook as Apple Greatest Leader Surpassing Steve Jobs

టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యాపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి చేర్చడంలో టిమ్‌ పాత్ర అనిర్వచనీయమన్నారు. స్టీవ్ జాబ్స్ హయాంలో కూడా యాపిల్ ఈ స్థాయికి చేరుకునేది కాదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

స్టీవ్ జాబ్స్ కంటే కుక్ మేటి!

సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుంది. కానీ, ట్రంప్ తన విశ్లేషణలో టిమ్ కుక్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. ‘నేను ఎల్లప్పుడూ టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ పెద్ద అభిమానిని. అయితే, ఒకవేళ స్టీవ్ జాబ్స్ అకాల మరణం చెందకుండా టిమ్ కుక్ బదులుగా ఆయనే సంస్థను నడిపించి ఉంటే.. యాపిల్ కచ్చితంగా బాగా పనిచేసేది, కానీ టిమ్ హయాంలో ఉన్నంత ఉన్నత స్థితికి మాత్రం చేరుకునేది కాదు’ అని ట్రంప్ అన్నారు.

సమస్యల పరిష్కర్తగా కుక్..

తమ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ టిమ్ కుక్ పనితీరును ట్రంప్ కొనియాడారు. తన మొదటి టర్మ్ ప్రారంభంలో టిమ్‌ చేసిన ఒక ఫోన్ కాల్ తమ స్నేహానికి పునాది వేసిందని ఆయన తెలిపారు. ‘సాధారణంగా కంపెనీలు కన్సల్టెంట్లకు మిలియన్ల డాలర్లు చెల్లిస్తాయి, కానీ పని పూర్తి కాదు. కానీ కుక్ నేరుగా నాకు కాల్ చేసి సమస్యను వివరించేవారు. ఆయన అడిగే విధానం, సమస్యలోని తీవ్రత నాకు నచ్చేవి. నేను వెంటనే వాటిని పరిష్కరించేవాడిని’ అని ట్రంప్ పేర్కొన్నారు. టిమ్‌ కేవలం తన పనే కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో ట్రంప్ గుర్తుచేశారు. కుక్ ఒక నమ్మశక్యం కాని వ్యక్తి అని, ఆయన కెరీర్ సాటిలేనిదని ప్రశంసించారు.

15 ఏళ్ల ప్రస్థానం..

దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు.

ఇంజినీర్ నుంచి గ్లోబల్ లీడర్ వరకు..

టిమ్ కుక్ ప్రయాణం ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌తో మొదలైంది. ఐబీఎంలో 12 ఏళ్లు, ఆపై కాంపాక్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యాపిల్‌ చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో కంపెనీ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించి, లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత స్టీవ్‌జాబ్స్‌ మరణానంతరం సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం యాపిల్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన విభాగం. అటువంటి సంస్థను విజయవంతంగా నడిపిన కుక్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.

ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Advertisement
 
Advertisement
Advertisement