కాసుల కోసం చెత్త పనులు | - | Sakshi
Sakshi News home page

కాసుల కోసం చెత్త పనులు

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

కాసుల కోసం చెత్త పనులు

రామాపురంలో డంపింగ్‌ యార్డుగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఆ యూనిట్‌ చుట్టూ ‘రియల్‌ ఎస్టేట్‌’ రాజకీయం అధికార పార్టీ నేతలు, అధికారులతో వ్యాపారుల కుమ్మక్కు చుట్టుపక్కల ధరలు పెరగడంతో తొలగించేలా స్కెచ్‌?

చీరాల అర్బన్‌: చీరాల పురపాలక సంఘం పరిధిలో కాసుల కోసం చెత్త పనులు చేస్తున్నారు. నెలకు రూ.లక్షల్లో ఖర్చవుతుంటే, ఆదాయం రూ.వేలల్లో కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామాపురంలో ఉన్నది డంపింగ్‌ యార్డా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌నా? అనే విషయంలో స్పష్టత రావడం లేదు. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల దృష్టి దానిపై పడింది. చుట్టు పక్కల భూములకు విలువ రావాలంటే ఆ యూనిట్‌ లేకుండా చేయాలని కొందరు పచ్చ నేతలతో కలసి వారు రంగంలోకి దిగారు. దానిని కార్యరూపంలోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. అందుకు కీలక నేత, యువనేతలు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఆదిలోనే ఆటంకాలు..

సుమారు 15 సంవత్సరాల క్రితం చీరాల మున్సిపల్‌ పరిధిలో రోజువారీ వచ్చే చెత్తను శుద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. ఆ క్రమంలో మున్సిపల్‌ పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ రోడ్డులో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించేవారు. తడి చెత్త నుంచి కంపోస్ట్‌ ఎరువును... పశువుల వ్యర్థాలు, ఆహార వ్యర్థాల నుంచి బయో గ్యాస్‌.. ప్లాస్టిక్‌, పేపర్‌ తదితరాలను రీ సైక్లింగ్‌ చేసి ఆదాయం పొందేందుకు నిర్దేశించారు. కొంత కాలం బాగానే ఇవన్నీ నడిచాయి. వర్మీ కంపోస్టును కూడా తయారు చేసి విక్రయించారు. ఆ తర్వాత మూలన పడ్డాయి. ఈ క్రమంలో చీరాల మున్సిపల్‌ పరిధిలో చెత్త శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో వేటపాలెం మండలం రామాపురం పరిధిలో 15 ఎకరాల భూమిని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు సేకరించారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఇవన్నీ దాటి పనులు ప్రారంభించారు.

2017లో యూనిట్‌ ప్రారంభం

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను రూ.5.79 కోట్ల వ్యయంతో 2017 మార్చి నెలలో ప్రారంభించారు. కొంత కాలం కూరగాయలు, ఆకు కూరలు కూడా పండించారు. పలు మిషన్లతో కొబ్బరిబొండాలు పీచు తీయటం, వర్మీ కంపోస్టు తయారీ తదితర పనులు చేపట్టారు. వాటిని విక్రయిస్తుండటంతో మున్సిపాలిటీకి కొంత ఆదాయం కూడా జమ అయింది. 2024లో కూటమి పాలన వచ్చాక యూనిట్‌ నిర్వహణ తీరు మారిపోయింది. ప్రస్తుతం అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది.

వ్యాపారుల కన్ను

తీర ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ యూనిట్‌ చుట్టూ స్థలాలు, పొలాలకు మంచి మార్కెట్‌ వచ్చింది. అక్కడ యూనిట్‌ను లేకుండా చేస్తే ఎకరా రూ.లక్షల్లో ఉన్న ధర రూ.కోట్లకు చేరుతుందని కొందరు పచ్చ నేతలు, స్థిరాస్తి వ్యాపారులు స్కెచ్‌ వేశారు. అందుకు కీలకనేత, యువనేత ఆశీస్సులు పొందారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సుమారు 30 ఎకరాలకుగాను ఎకరా ధర రూ.లక్షల్లో కొని వేరొకరికి రూ.కోట్లలో చేతులు మార్చేందుకు టోకెన్‌ అడ్వాన్స్‌ కూడా తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చెత్త యూనిట్‌ను మార్పిస్తామని నమ్మబలికినట్లు చెబుతున్నారు.

రోజుకు 25 టన్నుల వ్యర్థాలు

మున్సిపల్‌ పరిధిలో రోజుకు సుమారు 25 టన్నుల చెత్త వస్తోంది. దాన్ని రామాపురం యూనిట్‌కు తరలిస్తున్నారు. అయితే అక్కడ చెత్తను ఆదాయ వనరుగా మార్చే ఎలాంటి పనులు జరగటం లేదు. దీంతో యంత్రాలన్నీ తుప్పు పడుతున్నాయి. కొండలుగా పేరుకు పోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతోంది. నిర్దిష్ట ప్రణాళిక, కార్యాచరణ లేకుండా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ మూలనపడటంతో రూ.కోట్ల ప్రజాధనం వృఽథా అవుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement