కర్లపాలెం: క్రీడలతో క్రీడాకారులకు, ప్రేక్షకులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. పేరలి గ్రామంలో ఏర్పాటు చేసిన కోన ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయటం వలన గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించటంతో పాటు వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు దోహదపడతాయన్నారు. క్రీడాకారులందరూ సమయస్ఫూర్తితో ఆడాలని సూచించారు. తొలుత రిబ్బను కత్తిరించి పోటీలను ప్రారంభించిన కోన రఘుపతి సరదాగా బ్యాటింగ్ చేశారు.
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): యోగాతో ఆరోగ్యం మెరుగుపడుతుందని డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ హరికుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని కేర్ యోగా నాచురోపతి కాలేజీలో జిల్లా యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయటం వలన ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని కోరారు. జిల్లా యోగేంద్ర నోడల్ ఆఫీసర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.


