నిందితుడికి మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: నాగార్జునసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మాచర్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన నిందితుడు యరసాని ఇమ్మానియేల్‌కు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడికి అప్పీల్ చేసుకునే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉన్నట్లు కూడా న్యాయస్థానం తెలియజేసింది.
ఏపీఎం సోమశేఖర్‌కు రిమాండ్
కాకుమాను: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఏపీఎం సోమేశేఖర్‌ను కాకుమాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీఎం సోమశేఖర్ గతంలో కాకుమానులో పనిచేశారు. ఈ క్రమంలో గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుతో 2023లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏపీఎం సోమశేఖర్, అతడితోపాటు సీసీ సుబ్బారావుకు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. ఈక్రమంలో ఏపీఎం, సీసీలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు.


