గుంటూరు మెడికల్: గుండెజబ్బుతో మూడేళ్లుగా బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి వైద్యులు పునర్జన్మిచ్చారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్ చేసి యువకుడికి నూతన జీవితం ప్రసాదించారు. వివరాలు.. గుంటూరు శారదాకాలనీ 25వలైనుకు చెందిన గుండిమెడ వేద ప్రకాష్, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిందట గుండె జబ్బు సోకింది. 2023 మార్చిలో తీవ్రమైన ఛాతీనొప్పి, స్పృహ కోల్పోవడం, సడన్ కార్డియాక్ట్‌కు అరెస్టు సంభవించింది. వైద్యులు తక్షణమే కార్డియో పల్మనరీ రీసెర్చ్‌స్టేషన్ (సీపీఆర్) చేసి ప్రాణాలు కాపాడారు. కార్డియాక్ట్ ఎమ్మారై పరీక్షలో గుండె ఎడమ జటరిక తీవ్రంగా బలహీన పడినట్లు, గుండె పంపింగ్ సామర్ధ్యం 30 నుంచి 35 మాత్రమే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రక్త ప్రవాహం మందగించినట్లు గుర్తించి 2024 మే నెలలో ఆటోమ్యాటెడ్ ఇంప్లాంట్‌బుల్ కార్డియో వర్కర్ ట్యూబ్లర్ (ఏఐసీడీ) పరికరాన్ని వేద ప్రకాష్‌కు అమర్చామన్నారు. ఎన్ని చికిత్సలు చేసినా గుండె పనితీరు మెరుగు పడలేదని, గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని నిర్ధారించామని వివరించారు. విజయవాడ మాచవరానికి చెందిన 17 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతూ అవయవదానం చేయగా ఆ యువకుడి గుండెను వేద ప్రకాష్‌కు మే 26న అమర్చి విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేశామన్నారు. వేద ప్రకాష్ మాట్లాడుతూ తనకు ఆసుపత్రి వైద్యులు పునర్జన్మిచ్చారని, మూడేళ్లుగా ఆసుపత్రులు తిరిగి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ హార్ట్ ఫెల్యూర్‌తో బాధపడేవారికి నేడు అత్యాధునిక వైద్య చికిత్సలు వచ్చాయన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రాయపాటి మమత, హాస్పిటల్ చైర్మన్ రామోహన్‌రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రవికాంత్, డాక్టర్ నవీన్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ రామారావు, డాక్టర్ మృత్యుంజయకుమార్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ జయరామ్‌పాయ్ తదితరులు పాల్గొన్నారు.


