పల్లె గుండెల్లో విజయ వీచిక | Sakshi
Sakshi News home page

పల్లె గుండెల్లో విజయ వీచిక

Published Tue, Oct 17 2023 12:20 PM

rachabanda program in ZP Chairperson Piriya Vijaya - Sakshi

పల్లె జనాలను కుటుంబ సభ్యుల్లా వరసలు పెట్టి ఆప్యాయంగా పిలవడం, అక్కడి ఆడపడుచులతో తోబుట్టువులా కలిసిపోవడం, ఊరి కష్టసుఖాలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించడం, రాత్రి అదే పల్లెలో నిద్రపోవడం, ఉదయం లేచి మళ్లీ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీయడం.. క్షేత్రస్థాయిలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ చేసి చూపిస్తున్న కార్యక్రమాలివి. అధినేత ఆదేశాల మేరకు గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీ పతాకాన్ని జనం గుండెల్లో ప్రతిష్టిస్తున్నారామె. సంక్షేమ సమాచారం చేరవేస్తూనే.. సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. పల్లె నిద్ర, రచ్చబండ పేరుతో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆమెలోని నిఖార్సయిన రాజకీయ నాయకురాలికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  బాబాయ్‌ బాగున్నావా..? అవ్వా ఆరోగ్యం ఎలా ఉంది..? పిల్లలూ బడికెళ్లి చదువుకుంటున్నారా..? అమ్మా.. పింఛన్‌ అందుతోందా..? జిల్లా ప్రథమ పౌరురాలు సాధారణ పల్లెవాసులతో మాట కలుపుతున్న పద్ధతి ఇది. జెడ్పీ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ చేపడుతున్న పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమంలో ఇలాంటి ఆప్యాయమైన పలకరింపులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంతవరకు ఏ మహిళా నేత చేపట్టని ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలను అందుకుంటోంది. పేరు ఒకలా తీరు మరోలా కాకుండా పల్లె నిద్ర అంటే అచ్చంగా అదే పల్లెలో నిద్రిస్తూ.. రచ్చబండపై ముఖాముఖి మాట్లాడుతూ ఆమె ఆదర్శప్రాయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.    

ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రథమ పౌరురాలు పిరియా విజయ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన హోదాని పక్కన పెట్టి ఒక సాధారణ మహిళగా గ్రామస్తులతో కలిసిపోతున్నారు. సొంత మనిషిగా మెలిగి లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. గ్రామస్తులతో ముఖాముఖీ తర్వాత రాత్రి బస చేసి గ్రామాల పరిస్థితులను చూస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉండి అక్కడి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమస్యలు తెలుసుకుని, సంక్షేమాలను వివరించి వారితో మమేకమవుతున్నారు.   

కార్యక్రమం జరుగుతోందిలా.. 
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్‌ 30వ తేదీ నుంచి సోంపేట మండలం ఉప్పలాం సచివాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అమలు చేయడం ప్రారంభించారు.  

►సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సంబంధిత గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించినవి తెలియజేస్తూ, వారికి ఇంకేం కావాలో తెలుసుకొనే ప్రయత్నం చేసి, వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపిస్తున్నారు.  

►రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామస్తులు, మహిళలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకొని, వాటిని అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

►తర్వాత ఆ గ్రామస్తులతోనే రాత్రి భోజనం చేసి, అక్కడే పల్లెనిద్ర చేస్తున్నారు.  

►మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచి, మహిళలతో టీ తాగుతూ వారితో రచ్చబండపై సమావేశమవుతున్నారు.  

►గ్రామంలో అందుబాటులో ఉన్న టిఫిన్‌ చేసి మళ్లీ ఉదయం 7 గంటలకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, మిగతా ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్, గ్రామస్తులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముందురోజు మిగిలిపోయిన గడపలను తిరిగేలా మరుసటి రోజు ఉదయం 11గంటల వరకు నిర్వహిస్తున్నారు.   

9 గ్రామాల్లో పల్లెనిద్ర, రచ్చబండ.. 
► ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్‌ 30వ తేదీన సోంపేట మండలం ఉప్పలాం గ్రామంలో ప్రారంభించిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను ఇప్పటి వరకు 9 చోట్ల నిర్వహించారు.  

►నియోజకవర్గంలోని ఉప్పలాం, బట్టిగళ్లూరు, గొల్లవూరు, శాసనాం, మామిడిపల్లి–1, మామిడిపల్లి–2, ఇచ్ఛాపురం మండలం డొంకూరు, అరకభద్ర గ్రామాలు, కవిటి మండలం భైరిపురం గ్రామాల్లో చేపట్టారు. వేలాది గడపలను సందర్శించారు. వందలాది సమస్యలను స్వీకరించారు.  

► సోంపేట మండలం ఉప్పలాంలో 110, గొల్లవూరులో 20, టి.శాసనం పంచాయతీలో 10, మామిడిపల్లి పంచాయతీలో 30, కవిటి మండలం బైరీపురంలో 20, ఇచ్ఛాపురం మండలం టి.బరంపురంలో 10, అరకభద్రలో 10, డొంకూరులో 10 వినతులను స్వీకరించారు.  

►వచ్చిన అర్జీల్లో చాలా వరకు హౌసింగ్, రేషన్‌కార్డు, డ్రైనేజీ తాగునీటి, రోడ్లు తదితరమైనవి ఉన్నాయి. ఇవన్నీ వెంటనే పరిష్కరించదగ్గ వినతులే కావడంతో అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతున్నారు. పరిష్కారాలను చూపుతూ ప్రజలతో మమేకమవుతున్నారు పిరియా విజయ.    

Advertisement
 

తప్పక చదవండి

Advertisement