ప్రాణాలపై పిడుగు | 8 people died in the state due to lightning strikes | Sakshi
Sakshi News home page

ప్రాణాలపై పిడుగు

Apr 7 2026 5:38 AM | Updated on Apr 7 2026 5:38 AM

8 people died in the state due to lightning strikes

రాష్ట్రంలో 8 మంది మృత్యువాత 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆరుగురు, మన్యం జిల్లాలో ఇద్దరు మృతి  

8 మందికి తీవ్ర గాయాలు 

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సోమవారం పిడుగులు పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. 8 మందికి గాయాలయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఆరుగురు మృత్యువాతపడగా, ఐదుగురు గాయపడ్డారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మొక్క­జొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బిహార్‌కు చెందిన కన్నయ్య(18) మృతి చెందా­డు. ఆయనతో పాటు ఉన్న బిహార్‌ వాసులు ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. 

ఇదే మండలం యండ్రపల్లి గ్రామానికి సమీపంలో మొక్కజొన్న తోటలో కంకులు కోస్తున్న సమయంలో పిడుగు పడటంతో రైతు కూలీ బొందలపాటి నాగయ్య(60) ప్రాణాలు విడిచాడు. అలాగే, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి(37) పశువుల వ్యాపారం చేసుకుంటూ పుల్లలచెరువు మండలంలోకి రాగా, ఆయనపై పిడుగుపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

అలాగే, ముండ్లమూరు మండలం వేములబండ పొలాల్లో పిడుగుపడి పసుపుగల్లు గ్రామానికి చెందిన రావులపల్లి శివకృష్ణ (19) మృతిచెందాడు. దర్శి మండలం శామంతపూడిలో ఆవుల మల్లికార్జునరావు (26) మేత కోసం పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనిపై పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కనిగిరి సమీపంలో పిడుగు పడి బిహార్‌కు చెందిన కార్మికుడు దుర్గేష్‌కుమార్‌ (24)మరణించాడు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని పొలాల్లో పిడుగులు పడి కూలీలు వి.పార్వతి(40), డి.సింహాచలం (38) ప్రాణాలు విడిచారు. గాయపడిన ముగ్గురుని బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement