దేశీయ డేటా సెంటర్‌ సామర్థ్యంలో.. 25% వాటా లక్ష్యం | 100 MW Adani Data Center in Visakhapatnam | Sakshi
Sakshi News home page

దేశీయ డేటా సెంటర్‌ సామర్థ్యంలో.. 25% వాటా లక్ష్యం

Apr 22 2023 5:28 AM | Updated on Apr 22 2023 2:42 PM

100 MW Adani Data Center in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: దేశీయ డేటా సెంటర్‌ సామ­ర్థ్యంలో కనీసం 20 నుంచి 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.45,920 కోట్ల పెట్టుబడితో 138 డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లు 11 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో 737 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

2025 నాటికి ఈ డేటా సెంటర్ల సంఖ్య 183కు చేరడం ద్వారా 24 మిలియన్‌ చదరపు అడుగులతో 1,752 మెగావాట్ల సామర్థ్యానికి విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కనీసం 20 నుంచి 25 శాతం వాటాను చేజిక్కించుకోవడంలో లక్ష్యంగా రాష్ట్రంలో డేటా సెంటర్లను ప్రోత్సహిస్తున్నట్లు  తెలి­పింది. ఇందులో భాగంగా అదానీ గ్రూపు వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌ పేరుతో 100 మెగా­వాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

విశాఖ­పట్నం కాపులుప్పాడ వద్ద సుమారు 130 ఎక­రాల్లో రూ.7,210 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌తోపాటు ఐటీ, బిజినెస్‌ పార్క్, స్కిల్‌ సెంటర్, రిక్రియేషన్‌ సెంటర్లను అదానీ గ్రూపు అభి­వృద్ధి చేయనుంది. దీనిద్వారా 14,825 మందికిఉపాధి లభించనుంది. 

ఐదు దశల్లో డేటా సెంటర్‌ అభివృద్ధి
భీమునిపట్నం మండలం కాపులుప్పాడ వద్ద 60.29 ఎకరాల్లో ఈ డేటా సెంటర్‌ను ఐదు దశల్లో అభివృద్ధి చేయనుంది. భూమి కేటాయించిన మూడు ఏళ్లలోగా 10 మెగావాట్లుతో ప్రారంభించి నాలుగేళ్లకు 20 మెగావాట్లు, ఐదేళ్లకు 40 మెగావాట్లు, ఆరేళ్లకు 70 మెగావాట్లు, ఏడేళ్లకు 100 మెగావాట్ల సామర్థ్యం చేరుకునే విధంగా వైజాగ్‌ టెక్‌పార్క్‌ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు ఫిబ్రవరి 7, 2022లో భూ కేటాయింపులు చేసింది. అక్కడే నివాసం ఉంటూ పనిచేసుకునే విధంగా వాక్‌ టు వర్క్‌ విధానంలో నివాస ప్రాంతాలు, నివాసానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రత్యక్షంగా కల్పించే ఉద్యోగాల కల్పన ఆధారంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ వైజాగ్‌ టెక్‌పార్క్‌ నిర్మాణ పనులను మే 3న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రామల శాఖ ప్రణాళిక సిద్ధంచేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement