 
													బువనేశ్వర్: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ) బిల్లుకు బీజేడీ మద్దతివ్వదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఒడిశా ప్రజలు అపోహలు నమ్మవద్దని శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో భారతీయులకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఈ చట్టం విదేశీయులకు మాత్రమేనని పేర్కొన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ) చట్టాన్నిలోక్‌సభ, రాజ్యసభలో బిజు జనతా దల్(బీజేడీ) ఎంపీలు వ్యతిరేకించారని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం విజయవంతంగా చట్ట సభల్లో ఆమోదం పొందాక ఎన్‌ఆర్‌సీపై ఆసక్తి నెలకొంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రమవుతోంది. మొదట అస్సాం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు పలు ఇతర యూనివర్సిటీలు, ఐఐటీలు సంఘీభావం ప్రకటించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే.
చదవండి : పౌరసత్వ వివాదం: సీఎం మిస్సింగ్..!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
