
సాక్షి, హైదరాబాద్: నేరేళ్ల ఘటన విచారణ సమయంలో పోలీసులు నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బాధితులకు గతంలో ఉన్న వ్యాధులతోనే అనారోగ్యం పాలయ్యారని వెల్లడించారు. వారిపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునే ఎత్తుగడతో, భయంతో పోలీసులు కొడితే గాయాలయ్యాయని, ఎముకలు విరిగాయని పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. విచారణ సమయంలో మితిమీరి ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చిన ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామన్నారు.
సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న దురాగతాలు, అత్యాచారాలు, పోలీసు కేసులపై మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు నాయిని సమాధానం ఇచ్చారు. నేరెళ్ల ఘటన, లారీలను తగులబెట్టిన సమయంలో అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను వారే గాయపరిచారని పేర్కొన్నారు. కేసులో 8 మంది ప్రమేయం ఉన్నట్లు తేలిందని, ఆ కేసుల భయంతో ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. షబ్బీర్ కల్పించుకొని మాట్లాడుతూ అసలు దాడులే జరగలేదని హోం మంత్రి మొదట చెప్పి సభను తప్పుదోవ పట్టించారని చెప్పారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.
ఖమ్మం జిల్లాలో 20 వేల ఎకరాలకు సాగునీరు: హరీశ్‌రావు
ఖమ్మం జిల్లాలోని పాలేరు పాత కాల్వ ఆధునీకరణ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలేరు కాల్వ ఆధునీకరణపై ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్నకు హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఆ కాల్వ కింద 14,447 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 8 వేల ఎకరాలకు పరిమితమైందన్నారు. తాము ఆధునీకరణ చేపట్టడం వల్ల మరో 6 వేల ఎకరాలకు అదనంగా నీరందించేలా చేయగలిగామన్నారు. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం ఇస్తూ.. నల్లగొండ, సూర్యాపేటలో 150 సీట్లతో రెండు మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తామన్నారు.
26 లక్షల గొర్రెల పంపిణీ: తలసాని
గొర్రెల పథకంలో భాగంగా ఇప్పటి వరకు 26 లక్షల గొర్రెలు ఇచ్చామని, గొర్రెలు చనిపోయినా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మళ్లీ ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లబ్ధిదారులకు నష్టం వాటిల్లదన్నారు. పెద్ద పథకం కాబట్టి కొంతమంది దొంగలు చొరబడ్డారని, వారిపై 85 కేసులు నమోదు చేశామన్నారు.