మొబైల్‌ స్క్రీన్‌ కంటే మరుగుదొడ్డే నయం! 

Toilet Better Than Mobile Screen Revealed New Survey  - Sakshi

బ్యాక్టీరియాకు నిలయంగా మారిన ఫోన్‌లు

చర్మసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం

మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వస్తువుగా మొబైల్‌ ఫోన్‌ మారిపోయింది. మనలో చాలా మంది పొద్దున లేవగానే ఫోన్‌ ఎక్కడుందా అని వెతుక్కుంటాం. ఫోన్‌ చెక్‌ చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలు పెడతాం. అయితే మనం రోజూ పదులసార్లు టచ్‌ చేసే మన మొబైల్‌ స్క్రీన్‌పై  టాయ్‌లెట్‌లో కంటే మూడు రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఫోన్‌ వినియోగదారుల్లో కనీసం 35 శాతం మంది ఎప్పుడూ తమ మొబైల్‌ స్క్రీన్లను ఎటువంటి లిక్విడ్‌లు ఉపయోగించి శుభ్రపరచలేదని ఇంగ్లండ్‌కు చెందిన ‘ఇన్య్సూరెన్స్‌ టూ గో’ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు  స్కై.కామ్‌  వెబ్‌సైట్‌ పేర్కొంది. 

స్మార్ట్‌ ఫోన్‌లు వాడే ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరు నెలలోపు తమ మొబైల్‌ స్క్రీన్లను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన మూడు ఫోన్ల స్క్రీన్లపై ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ఒక్కో స్క్రీన్‌పై సుమారుగా 84.9 యూనిట్ల క్రిములను గుర్తించారు. స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు 30 యూనిట్ల క్రిములు, లాక్‌ బటన్‌పై 23.8 యూనిట్లు, హోమ్‌ బటన్‌పై సుమారుగా 10.6 యూనిట్ల క్రిములు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది.  టాయ్‌లెట్, ఫ్లష్‌పై 24 యూనిట్ల క్రిములు ఉంటాయి. ఆఫీసులో ఉపయోగించే కీ బోర్డులు, మౌస్‌లపై ఐదుశాతం క్రిములు ఉంటాయి.

మొబైల్‌ ఫోన్ల స్క్రీన్‌లపై ఉన్న ఈ బ్యాక్టీరియా కారణంగా చర్మసంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు(40 శాతం),  35 సంవత్సరాల లోపు వారు 60 శాతం మంది లేచిన వెంటనే ఐదు నిమిషాల వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. అలాగే పడుకునే ఐదు నిమిషాల ముందు వరకు  ఫోన్లను పరిశీలిస్తున్న వారిలోనూ 60 శాతం మంది 35 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top