ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడగా, తాజాగా మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై అదే విభాగానికి చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకిషోర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మంగళవారం యూనివర్సిటీ అధికారులకు, పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వివరాలు ఇలా వున్నాయి... ఈ నెల 15న రాత్రి విద్యార్థిని సెల్ ఫోన్‌కు అధ్యాపకుడి పేరుతో మూడు మెసేజ్‌లు వచ్చాయి.
తిరిగి 16న మరో ఆరు మెసేజ్‌లు వచ్చాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా వారి సలహా మేరకు విద్యార్థిని ఆ అధ్యాపకుడికి ఫోన్ చేసింది. తన రూమ్‌కు పర్సనల్‌గా రావాలని కోరడంతో విద్యార్థిని రూమ్‌కు వెళ్ళగా ల్యాప్‌టాప్‌లో ఏవో న గ్న చిత్రాలు చూపించారని, తాను కూడా వున్న చిత్రాలు వున్నాయని, ఇంటికి వస్తే అవి చూపిస్తానని చెప్పాడని పేర్కొంది. ఆ తరువాత గది తలుపులు వేసి తనపై అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విద్యార్థుల ధర్నా.. బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అధ్యాపకునిపై చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. సాయంత్రం మరో వర్గం విద్యార్థులు అధ్యాపకునికి అనుకూలంగా యూనివర్సిటీ మెకానికల్ బ్రాంచ్ ఎదుట ఆందోళన చేశారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులు, ఫొటో గ్రాఫర్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో ఓ కెమెరా ధ్వంసం అయ్యింది.
దర్యాప్తునకు త్రిసభ్య కమిటీ.. విద్యార్థిని ఫిర్యాదు మేరకు శాఖాపరమైన దర్యాప్తునకు త్రిసభ్య కమిటీ వేశామని రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్. కాంతం తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. మధుసూదనరావు, లా విభాగం అధిపతి ఆచార్య ఎల్. జయశ్రీ , మహిళా వసతి గృహాల చీఫ్ వార్డెన్ డాక్టర్ స్వరూపరాణిలు కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.