అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. అల్లర్లలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అల్లర్లు జరగటం దురదృష్టకరమన్నారు. బాధితుల్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణం నెలకొనటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలు సహకరిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కాగా ముజఫర్ నగర్లో హిందువుల్లోని జాట్ తెగకు ముస్లిం మతస్థుల మధ్య చోటు చేసుకున్న చిన్న సంఘటన చినికిచినికి గాలివానగా మారింది.ఆ ఘర్షణలో దాదాపు 48 మంది మరణించగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే.