తమిళసినిమా: సినిమా చాలా పవర్ ఫుల్. దీనికి ఆకర్షణ శక్తి అధికం. చిన్న ఆసక్తి ఉంటే ఎలాంటి పెద్ద వ్యాపారవేత్తనైనా సినిమా లోనికి లాగేస్తుంది. ఒకవేళ నష్టాలు ఎదురైనా, మళ్లీ మళ్లీ చిత్రాలు చేయిస్తుంది. ఇందుకు చిన్న ఉదాహరణ నిర్మాత, దర్శకుడు, నటుడు ఇసక్కీ కార్వణన్. ఈయన తాజాగా లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం అట్టి. నటి అయిలి వెబ్ సిరీస్ ఫేమ్ అభి నక్షత్ర నాయకిగా నటించిన ఇందులో నటుడు కాదల్ సుకుమార్, సౌందర్, ప్రవీణ్ పళనిసామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ సంస్థ అధినేత సురేష్ కామాక్షి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు ఇసక్కీ కార్వణన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇంతకు ముందు మహిళలు పోరాడి స్వాతంత్య్రాన్ని తెచ్చుకున్నారు. అలా అబలను, అత్యాచారాలకు గురయ్యే అభాగ్యులను కాపాడే ప్రయత్నం చేసే వీరనారీమణుల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఆట్టి అని చెప్పారు. తాను ఇందులో పోలీస్ అధికారిగా నటించినట్లు చెప్పారు. ఊరు నుంచి తరిమివేయబడ్డ వ్యక్తిలా తాను సొంత ఊరి నుంచి ముంబయి వెళ్లి పడ్డానని, ఆ తరువాత వ్యాపార రంగం లోకి నెట్టబడ్డానని చెప్పారు. అలా వందలాది మందికి ఉపాధి కల్పించే లాజిస్టిక్స్ వ్యాపారంతో పారిశ్రామిక వేత్తగా ఎదిగానని, అలా 25 ఏళ్లు వ్యాపార రంగంలో కొనసాగుతున్న తనను సినిమాపై ఆసక్తి ఈ రంగంలో తీసుకొచ్చిందని చెప్పారు. అలా మొదట నిర్మాతగా ముదల్ కనవే అనే చిత్రాన్ని నిర్మించానన్నారు. అలా కొన్ని చిత్రాలు చేసిన తరువాత నటుడిగా మారి చిత్రాలు నిర్మిస్తున్నానని చెప్పారు. అలా దర్శకుడిగానూ మారి బకరి, పెట్టికడై, తమిళ్ కుడిమగన్, పరమశివమత ఫాతిమా తదితర చిత్రాలు చేశానని చెప్పారు. తాజాగా ఆట్టి చిత్రం చేశానని పేర్కొన్నారు. ఇవన్నీ మంచి సందేశంతో కూడిన కథా చిత్రాలని చెప్పారు. తాను సినిమా గురించి నేర్చుకున్నది ఏమింటే నిజ జీవితం వేరు, సినిమా వేరు అని అన్నారు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అనీ, సందేశాత్మక కథా చిత్రాలు చాలా నిరాశనే మిగిల్చాయని నటుడు, దర్శక నిర్మాత ఇసక్కీ కార్వణన్ పేర్కొన్నారు.


