ఆదర్శవంతమైన జిల్లాగా తిరుచ్చి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శవంతమైన జిల్లాగా తిరుచ్చి

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

● మంత్రి రమేష్‌ ధీమా ●అధికారులతో కీలక సమీక్ష

సాక్షి,చైన్నె: రాబోయే ఐదేళ్ల కాలంలో తిరుచిరాపల్లి (తిరుచ్చి) జిల్లాను తమిళనాడులోనే అత్యంత ఉత్తమమైన, ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర హిందూ దేవదాయశాఖ మంత్రి ఎస్‌.రమేష్‌ ధీమా వ్యక్తం చేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రతీక్‌దయాల్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో జిల్లాలో సాగుతున్న పలు అభివృద్ధి పనులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. సమావేశాన్ని మూడు ముఖ్యమైన విభాగాలుగా విభజించి నిర్వహించామని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ ప్రజా సంక్షేమ పథకాల పురోగతిని పరిశీలించామని, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనుల ప్రస్తుత స్థితిపై చర్చించామని, రాబోయే రోజుల్లో ప్రజల కోసం తీసుకురావాల్సిన కొత్త ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. అభివృద్ది పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులు ఆదేశించామని చెప్పారు. సీఎం విజయ్‌ ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందిస్తున్నారని, వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎలాంటి అవినీతి, దోపిడీకి తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ప్రజలకు చేరాలనేదే తమ ఉద్దేశం అన్నారు. వచ్చే ఐదేళ్లలో తిరుచ్చి జిల్లా రూపురేఖలను పూర్తిగా మార్చేసి, రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ జిల్లాగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement