క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

●పిల్‌ దాఖలు చేసిన న్యాయవాది ●స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మదురై హైకోర్టు ఆదేశం

మంత్రి ఆదవ్‌ అర్జున అడ్డగింత

వేలూరు: రాష్ట్ర పంచాయితిరాజ్‌ శాఖ, క్రీడా మంత్రి ఆదవ్‌అర్జునను తిరువణ్ణామలై జిల్లా ఇన్‌చార్జిమంత్రిగా నియమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తిరువణ్ణాలైకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలతో పాటు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉదయం తిరువణ్ణామలై ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలోని వసతులపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన్ను రోగులు, బంధువులు ఉన్న ఫలంగా ముట్టడించారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల వద్ద సిబ్బంది లంచాలు డిమాండ్‌ చేస్తున్నారని ఇవ్వకుంటే సరైన వైద్యం అందజేయడం లేదన్నారు. సమస్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

గిరివలయం రోడ్డులో భద్రత పెంచుతాం:

మంత్రి ఆదవ్‌అర్జున

తిరువణ్ణామలైలో మంత్రి ఆదవ్‌అర్జున విలేకరులతో మాట్లాడుతూ తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో రాత్రి సమయంలో భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

బైక్‌ ట్యాక్సీ సేవల

క్రమబద్ధం కోసం..!

కొరుక్కుపేట: తమిళనాడులో రాపిడో, ఓలా, ఉబెర్‌ వంటి డిజిటల్‌ సర్వీస్‌ సెంటర్‌ బైక్‌ ట్యాక్సీలు పెరుగుతున్నాయి. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరోవైపు బైక్‌ రైడర్లకు జరిమానాలు, వాహనాల జప్తు, క్రిమినల్‌ కేసుల నమోదు, శిక్షలు.. మొదలైనవి ప్రతిబంధకంగా మారాయి. తమిళనాడులో ఈ సేవలపై ఎలాంటి నియంత్రణ లేదు. అవి పూర్తిగా సంబంధిత డిజిటల్‌ కంపెనీలపై ఆధారపడి ఉండటం, రాష్ట్రంలో ఆ కంపెనీలు ఎక్కడా కార్యకలాపాలు నిర్వహించకపోవడం..ఇత్యాది కారణాల నేపథ్యంలో బైక్‌ ట్యాక్సీల డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మదురైకు చెందిన న్యాయవాది నవీన్‌కుమార్‌ మదురై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కింద కేసు దాఖలు చేశారు. చట్ట ప్రకారం లైసెన్సులు జారీ చేసి బైక్‌ టాక్సీ సేవలను నిర్వహించడానికి అనుమతించే నిబంధనలను రూపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

వైద్యలింగంకు

మళ్లీ చిక్కులు?

– కోర్టులో డీవీఏసీ పిటిషన్‌

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే హయాంలో గృహ నిర్మాణ మంత్రిగా ఉన్న సమయంలో నమోదైన కేసు ఉచ్చు తాజాగా డీఎంకే నేత వైద్యలింగంకు మళ్లీ కొత్త చిక్కులు సృష్టించనున్నాయి. గత డీఎంకే ప్రభుత్వం హయాంలో ఈ అవినీతి కేసుకు ముగింపు పలకగా, తాజా టీవీకే ప్రభుత్వం మళ్లీ విచారణ దిశగా శుక్రవారం కోర్టును ఆశ్రయించింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరెప్షన్‌ (డీవీఏసీ) ద్వారా ఈ పిటిషన్‌ను తాజాగా దాఖలు చేశారు.

రూ.28 కోట్ల లంచం కేసు నేపథ్యం

2011–2016 అన్నాడీఎంకే ప్రభుత్వంలో గృహ నిర్మాణ మంత్రిగా వైద్యలింగం వ్యవహరించారు. చైన్నె పెరుంగళత్తూర్‌ పరిధిలో ఓ భారీ భవన నిర్మాణ అనుమతుల విషయంలో రూ. 28 కోట్లు లంచం పుచ్చుకున్నట్టు అరప్పోర్‌ ఇయక్కం 2022లో డీవీఏసీకి ఫిర్యాదు చేసింది. 2024లో అధికారులు ఈ ఫిర్యాదుపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈడీ సైతం రంగంలోకి దిగి మనీ లాండరింగ్‌ కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టింది.

డీఎంకేలో చేరికతో కేసు ముగింపు:

ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే, ఈ ఏడాది జనవరిలో వైద్యలింగం అన్నాడీఎంకేను వీడి డీఎంకేలోచేరారు. పార్టీ మారిన కొద్ది రోజులలోనే వైద్యలింగంపై ఉన్న ఆఽరోపణలకు ఆధారాలు లేవంటూ కేసుకు ముగింపు పలుకుతూ కోర్టులో నివేదికను అధికారులు సమర్పించారు. దీనిని అరప్పోర్‌ ఇయక్కం, ఈడీలు వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేశాయి.

మళ్లీ మొదటికి వచ్చిన విచారణ

తాజాగా రాష్ట్రంలో అధికారం మారడంతో వైద్యలింగం మెడకు ఈ కేసు ఉచ్చుగా మారింది. టీవీకే ప్రభుత్వం మళ్లీ విచారణపై దృష్టి పెట్టింది. గతంలో ఈ కేసును ముగిస్తూ దాఖలు చేసిన నివేదికను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ డీవీఏసీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. చైన్నె ప్రాథమిక సెషన్‌న్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎస్‌.కార్తికేయన్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. కేసును ముగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ఇప్పటికే పిటిషన్‌ వేశామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైద్యలింగం తరఫున న్యాయవాది స్పందిస్తూ, ఈడీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసు ముగింపును వ్యతిరేకిస్తున్న అరప్పోయర్‌ ఇయక్కం వాదనలు వినిపించింది. వాదనల అనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లు తర్వాత విచారణను ఈనెల 29వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ కేసును మళ్లీ తవ్వేందుకు టీవీకే ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుండడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement