సాక్షి, చైన్నె: తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్ పేజీలో స్పందించారు.
అవన్నీ డీఎంకే సాధించినవే..
ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల సోఫా మోడల్ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్ విజయాలా అని ప్రశ్నిస్తూ, దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మౌనం ఎందుకో...
ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్ తీసుకున్న యూ–టర్న్‌లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు.


