సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌షా నివాసంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ నేతలతో మూడు గంటల పాటు సుదీర్ఘ సంప్రదింపుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ముందుకు సాగడానికి ఈ సమావేశం వేదికగా అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.
సుదీర్ఘ మంతనాలు
గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్ ముఖ్యభూమిక పోషించారు. తమిళనాడు నుంచి కేంద్ర కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు నైనార్ నాగేంద్రన్, ఎల్. మురుగన్, పొన్‌రాధాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, వానతి శ్రీనివాసన్ పాల్గొన్నారు. మొదటి రెండు గంటల పాటు నితిన్ నబిన్ సమక్షంలో ఎన్నికల ఓటమికి గల కారణాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరుపై నేతలు విస్తృతంగా చర్చించారు.
తమిళనాడులో గెలవలేమా?: అమిత్ షా
రాత్రి 9 గంటల ప్రాంతంలో సమావేశానికి చేరుకున్న అమిత్‌షా గంటసేపు రాష్ట్ర నేతలతో మాట్లాడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలిసింది. ఆమేరకు పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారి గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. పోయిన వారిని వెళ్లనివ్వండి. ప్రస్తుతం పార్టీలో ఎవరున్నారు, వారిని లీడర్లుగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే ముఖ్యం’ అని సూచనలు చేసి ఉండటం గమనార్హం. ఒకప్పుడు తమిళనాడు కంటే చాలా బలహీనంగా ఉన్న పశ్చిమబెంగాల్‌లోనే ఊహించని విజయం సాధించి పెద్ద శక్తిగా ఎదిగామని, మరి తమిళనాడులో విజయం సాధించడం అసాధ్యమా? కచ్చితంగా సాధించగలం అన్న ధీమాను వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కొత్త స్ఫూర్తిని ఇచ్చింది
ఢిల్లీ సంప్రదింపుల సమావేశం అనంతరం డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ‘అమిత్‌షా అచంచలమైన భవిష్యత్ ప్రణాళిక, సంస్థాగత వ్యూహాలు, నితిన్ నబిన్ మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వివరించారు. మరింత కష్టపడి పనిచేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడం తథ్యమని, సరికొత్త ఉత్సాహంతో తమిళనాడు బీజేపీ ఈ సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు.


