లిడియన్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

లిడియన్‌కు ఘన స్వాగతం

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

సాక్షి, చైన్నె : లండన్‌ సింఫనీ ఆర్కెస్ట్రాకు చెందిన 92 మంది అంతర్జాతీయ సంగీత విద్వాంసులతో కలిసి, చిన్న వయసులోనే స్వయంగా సొంత సింఫనీ సంగీతాన్ని సృష్టించి సరికొత్త చరిత్ర సృష్టించిన తమిళనాడు యువకిరణం లిడియన్‌ నాదస్వరం శుక్రవారం చైన్నెకి చేరుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు రాజ్‌మోహన్‌, వన్నియరసు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా పాల్గొని లిడియనన్‌ను అభినందించారు. మీడియాతో లిడియన్‌ నాదస్వరం మాట్లాడుతూ తాను చైన్నెలోనే పెరిగానని, తన సంగీత ప్రస్థానమంతా ఇక్కడే ప్రారంభమైందన్నారు. ఈనెల 21న చైన్నె మ్యూజిక్‌ అకాడమీలో తాను రూపొందించిన సింఫనీ ఒక అద్భుతమైన సంగీత కళాఖండంగా అలరించనుందన్నారు. త్వరలోనే ఈ పూర్తి సింఫనీని లండన్‌ , చైన్నె నగరాలలో పెద్ద ఎత్తున ప్రదర్శించబోతున్నాని తెలిపారు. తాను సంగీత దర్శకులు ఇళయరాజా వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. యువ సంగీతకారుడి అసాధారణ ప్రతిభను కొనియాడుతూ రాష్ట్ర మంత్రి రాజ్‌మోహన్‌ మాట్లాడుతూ, లిడియన్‌ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ మైలురాళ్లను అధిగమించడానికి తమిళనాడు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలనైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం లిడియన్‌ మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement