సాక్షి,చైన్నె: కాలం కొన్నిసార్లు నమ్మశక్యం కాని అద్భుతాలను సృష్టిస్తుంది. అలాంటి ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటనే తమిళనాడులోని తిరునల్వేలి (నైల్లె) పరిధిలోని పెరుమల్‌పురంలో శుక్రవారం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు వేర్వేరు సంవత్సరాలలో, కానీ ఒకే తేదీన, ఒకే ఆస్పత్రిలో, ఒకే వైద్యురాలి చేతుల మీదుగా జన్మించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. ఈ అరుదైన ఘటన నైల్లె పాళయంంకోటకు చెందిన జెబాసన్, ఆయన భార్య సిబామానోస్ దంపతుల కుటుంబంలో చోటుచేసుకుంది. వీరికి జహస్లీల్ మానోస్ కుమారుడు, సెరాఫిన్, ఐసానియా షేర్ (జానియా) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ముగ్గురి జననం వెనుక ఉన్న జూన్ 10 తేదీ ఓ మ్యాజిక్‌గా మారింది.
వేర్వేరు సంవత్సరాలు.. ఒకే తేదీ
ఈ దంపతుల పెద్ద కుమారుడు 2015లో, 2017లో రెండవ సంతానంగా కుమార్తె , ఆ తర్వాత 8 సంవత్సరాల వ్యత్యాసంతో మరో కుమార్తె 2025లో జన్మించారు. సరోగసీ విధానం ద్వారా జన్మించిన ఈ ముగ్గురు పిల్లల మధ్య కొన్ని సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. కానీ, వీరంతా జూన్ 10వ తేదీనే జన్మించడం విశేషం.
ఒకే డాక్టర్ – ఒకే ఆస్పత్రి
ఈ ముగ్గురు పిల్లల ఆరోగ్యకరమైన ప్రసవాలు పెరుమల్‌పురంలోని ఒకే ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో జరిగాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రామోలా జనెట్ డయానానే ఈ ముగ్గురు పిల్లలకూ ప్రసవం చేశారు. ఈ అరుదైన ఘటనలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ముగ్గురు పిల్లలకు చికిత్స అందించి, ప్రసవం చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రామోలా జానెట్ డయానా పుట్టినరోజు కూడా సరిగ్గా జూన్ 10వ తేదీనే కావడం గమనార్హం. దీంతో జూన్ 10 అనేది ఆ కుటుంబానికి, ఆ జంటకు, సదరు వైద్యురాలికి అత్యంత ప్రత్యేకమైన, మరువలేని రోజుగా మారిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సంవత్సరాల వ్యత్యాసంలో ఒకే రోజున, ఒకే ఆస్పత్రిలో, ఒకే వైద్యుని ద్వారా ఆరోగ్యకరమైన ప్రసవాల రూపంలో జన్మించడం ప్రపంచంలోనే అత్యంత అరుదైన సంఘటనగా రికార్డులకుకెక్కింది. దీనిని పరిశీలించిన యూనివర్సల్ అచీవర్స్ సంస్థ ఈ అపురూప ఘనతను ప్రపంచ రికార్డుగా ఆమోదించి, బ్లూ చెక్ కార్డ్‌లను మంజూరు చేసింది. ఈ రికార్డుకు సంబంధించిన అధికారిక కార్యక్రమం ఈనెల 15వ తేదీన చైన్నెలో జరగనుంది.


