● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
సాక్షి, చైన్నె: తమిళనాడులో నిర్వహించే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను తమిళ్ తాయ్ వాళ్తు (తమిళ తల్లి ప్రార్థనా గీతం)తోనే ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌న్‌పై సమ గ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శు క్రవారం మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వివాదానికి ఆజ్యం ప్రమాణ స్వీకారం
మే 10న జరిగిన తమిళనాడు సీఎం విజయ్, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సంప్రదాయానికి భిన్నంగా మొదట వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం (జనగణమన) ఆలపించి, మూడో ప్రాధాన్యతగా తమిళ్ తాయ్ వాళ్తును వినిపించారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని పక్కనబెట్టి రాష్ట్ర గీతాన్ని మూడో స్థానానికి పరిమితం చేయడం తమిళ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై చైన్నెకి చెందిన అనన్య రాధాకృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ ప్రధాన అభ్యంతరాలు
తమిళనాడులో ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా తమిళ్ తాయ్ వాళ్తుతో ప్రారంభమవడం, జాతీయ గీతంతో ముగియడం అనేది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయంగా కోర్టుకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పద్ధతిని నీరుగారుస్తూ రాష్ట్ర గీతం కంటే ముందు వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపించడం సరికాదని వివరించారు. కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను వందేమాతరంతో ప్రారంభించాలని సూచించినప్పటికీ, రాష్ట్ర గీతాన్ని ఆలపించడాన్ని ఎక్కడా నిషేధించలేదన్నారు. తమిళ్ తాయ్ వాళ్తు ఆలపించడం అనేది కేవలం ఒక ప్రభుత్వ సంప్రదాయం కాదని, ఇది తమిళుల భావోద్వేగం, సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీక అని వివరించారు. ఈ సాంస్కృతిక ఘర్షణలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సదరు ఉత్తర్వులను రద్దు చేయాలని, భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ్ తాయ్ వాళ్తుకే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి మొదట ఆలపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.
కోర్టు ఆదేశం
పిటిషన్‌న్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, న్యాయమూర్తి జి.అరుళ్ మురుగన్‌న్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వాదనలను పరిశీలించిన బెంచ్, ఈ వివాదంపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఎనిమిది వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేశారు.


