సాక్షి, చైన్నె: ప్రతి ఏటా జూన్ 12న డెల్టా జిల్లాల వర ప్రదాయిని మేట్టూరు జలాశయం నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. 2020 వరకు నిర్ణీత సమయంలో నీళ్లు ఎప్పడూ విడుదల కాకపోవడంతో రైతులు కష్టాలను ఎదుర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం నైరుతి రుతు పవనాల ప్రభావం ఆశాజనకంగానే ఉంటూ వచ్చింది. కర్ణాటకలో పవనాలు ప్రభావం చూపించడంతో కావేరి పరవళ్లు తొక్కింది. అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు మేట్టూరు జలాశయం పలు మార్లు పూర్తిగా నిండి ఉబరి నీరు డెల్టా జిల్లాల వైపు ఉగ్రరూపంతో ప్రవహించింది. దీంతో 2021, 2022లో నిర్ణీత సమయం కంటే ముందుగానే నీటిని సాగు నిమిత్తం జలాశయం నుంచి విడుదల చేశారు. 2023లో నిర్ణీత సమయంలోనే నీళ్లు విడుదలయ్యాయి. 2024లో నీరు కరువుతో కాస్త ఆలస్యమైంది. 2025లో నిర్ణీత సమయంలోనే నీరు విడుదల కావడంతో గత ఐదేళ్లలో డెల్టాలో ఐదు లక్షల ఎకరాల్లో కురువై సీజన్ వరి సాగు చేయగా, మరో 17 లక్షల ఎకరాల్లో ఇతర పంటల సాగు జరిగింది. అయితే, ఈఏడాది రైతులు పొలం దుక్కి దున్నేందుకు వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడుకు ఇవ్వాల్సిన నీటిని కర్ణాటక విడుదల చేయక పోగా, మేఘధాతు వద్ద డ్యాం నిర్మాణ పనులు చేపట్టడంతో వివాదానికి దారి తీసింది. అదేసమయంలో రాష్ట్రంలో అధికారం మారింది. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వంలో తొలిసారిగా నీరు విడుదల కోసం ఎదురు చూసిన డెల్టా రైతులకు మిగిలింది నిరాశే. ప్రస్తుతం మేట్టూరు డ్యామ్‌లో నీటిమట్టం 79.56 అడుగులు మాత్రమే ఉండడంతో సాగుకు నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.
కంటి తుడుపు చర్యే
మేట్టూరు డ్యామ్ తెరవడం అసాధ్యం కావడంతో తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, మైలాడుతురై వంటి డెల్టా జిల్లాల కురువై సాగు ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం 90 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. డెల్టాల్లో యాభై చోట్ల శుక్రవారం రైతు సంఘాలు ఆందోళనలకు దిగాయి. డెల్టాను కరువుప్రాంతంగా ప్రకటించాలని నినదించాయి. కురువై ప్యాకేజీపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి స్పందిస్తూ, ప్యాకేజీ ఓ డ్రామా అని మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ను 18 గంటలకు తగ్గించడం విచారకరమని అన్నారు. రుణ మాఫీపై మాట తప్పినట్టుగానే, తాజాగా కురువై విషయంలో రైతులను నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. డెల్టాలో రూ.2 వేల కోట్ల మేరకు సాగు ఉత్పత్తి నష్టం ఈ సీజన్‌లో తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.
రీల్స్‌మోడల్ పాలన: స్టాలిన్
ప్యాకేజీతో ప్రయోజనాలు:
వరి సాగులో ఆధునిక యాంత్రీకరణను పెంచేందుకు వీలుగా యంత్రాల ద్వారా నాటు వేయడం, నేరుగా విత్తడం చేపట్టే రైతులకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు అందుతాయి.
నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాల పంపిణీతోపాటు జీవ ఎరువులు, మైక్రోన్యూట్రిజెంట్ ఎరువుల మిశ్రమాలను భారీ సబ్సిడీపై అందిస్తారు.
మోటార్ల ద్వారా సాగు చేసుకునే రైతులకు రోజుకు 18 గంటలపాటు నిరంతర త్రీ–ఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తారు.
ఈ సీజన్‌కు ఇప్పటికే 10,714 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలను, 4.02 లక్షల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను ప్రభుత్వం జిల్లాల్లో సిద్ధంగా ఉంచింది.
రూ.110 కోట్లతో కాలువల పూడికతీత పనులు పూర్తి.
సాగునీరు వృథా కాకుండా చివరి ఆయకట్టు భూముల వరకు చేరేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
డెల్టా రైతుల వరప్రదాయిని మేట్టూరు డ్యాం గేట్లు శుక్రవారం తెరుచుకోలేదు. రిజర్వాయర్‌లో నీళ్లు తక్కువగా ఉండడంతో కురువై సాగుకు నీరు కరువైంది. ఈ సీజన్‌లో అన్నదాతకు మిగిలింది కన్నీరే అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీఎం విజయ్ ప్రభుత్వం ప్రత్యేక కరువై ప్యాకేజిని ప్రకటించింది. రూ.134 కోట్లతో రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టే దిశగా చర్యలు చేపట్టారు. ఇది కంటి తుడుపేనని డీఎంకే, అన్నాడీఎంకేలు మండిపడ్డారు. రైతు సంఘాలు పోరుబాట పట్టాయి.
తమిళనాడులో రైతుల జీవనోపాధిని కాపాడేందుకు సీఎం విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెల్టా, నాన్–డెల్టా జిల్లాల్లో కురువై సీజన్‌లో వరి దిడుబడిని పెంచే లక్ష్యంతో రూ.134.83 కోట్ల వ్యయంతో కురువై ప్రత్యేక ప్యాకేజీ–2026ను సీఎం విజయ్ శుక్రవారం ప్రకటించారు. డెల్టా జిల్లాల్లోని బోరు బావులు, ఫిల్టర్ పాయింట్ల ద్వారా 3.55 లక్షల ఎకరాల్లో సాగును విజయవంతం చేసేందుకు రూ.77.50 కోట్లు కేటాయించారు. నాన్–డెల్టా ప్రాంతాలలో రూ.57.33 కోట్లతో కురువై, స్వర్ణవారి పంటలు వేసే రైతులకు అవసరమైన రాయితీలు అందించేందుకు నిధులు కేటాయించారు.
ఇది రీల్స్ మోడల్ పాలన, పొయ్యి వెలిగించకుండా వంట చేసినట్టే ఉంది సీఎం విజయ్ ప్యాకేజీ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. అనుభవం లేని ఈ ప్రభుత్వం మేట్టూరును పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. క్యారవాన్‌కు పరిమితమైన వారికి రైతుల కష్టాలు ఏం తెలుసునని ప్రశ్నించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమిళనాడులోని టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఉండడంతోనే, మేఘధాతు విషయంలో ఈ పాలకులు మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు అడిగితే, ప్యాకేజీతో సర్దుకోవాలని పేర్కొనడం శోచనీయమన్నారు.


