రాజకీయాల్లోకి లారెన్స్‌? | - | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి లారెన్స్‌?

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

● హాట్‌ టాపిక్‌గా మారిన లేటెస్ట్‌ వీడియో ● ‘మీరు వద్దంటే రాను’ అంటూ ఫ్యాన్స్‌ కోర్టులోకి బంతి

సాక్షి, చైన్నె: తమిళనాట సినిమా స్టార్ల పొలిటికల్‌ ఎంట్రీల పరంపర తమిళనాట కొనసాగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారనే వార్త కోలీవుడ్‌తోపాటు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఊహాగానాలపై ఎట్టకేలకు రాఘవ లారెన్స్‌ స్పందించారు. శుక్రవారం ఉదయం తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా 18 నిమిషాల నిడివిగల ఒక వీడియోను విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

పొలిటికల్‌ జర్నీపై లారెన్స్‌ ఏమన్నారంటే..?

తాను ఎప్పుడూ పదవుల కోసమో, డబ్బు సంపాదించాలనే ఆశతోనో రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని లారెన్స్‌ స్పష్టం చేశారు. నేను నమ్మే, నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, నేను వ్యక్తిగతంగా చేస్తున్న సామాజిక సేవను మరింత విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రమే నాకు ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు నన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి అని పేర్కొన్నారు. అలాగే, కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన ఈ వీడియోలో పంచుకున్నారు.

మొదటి అడుగు

జల్లికట్టు నిరసనల్లో పాల్గొనడం, ఆ తర్వాత రాజకీయ పార్టీ నేత సీమాన్‌ చేసిన విమర్శలకు తాను బదులివ్వడమే రాజకీయాల్లో తన మొదటి అడుగుగా భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వాలని అనుకున్నానని, అయితే ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పినప్పుడల్లా, రాజకీయాలు ఒక పెద్ద భారం.. నీకొద్దని తన తల్లి వారించినట్టు లారెన్స్‌ తెలిపారు.

విజయ్‌ విజయం.. మారిన అమ్మ మనసు

తన మిత్రుడు విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయాన్ని తన తల్లికి వివరించినట్లు చెప్పారు. దీంతో అమ్మ మనసు మారి నీకు నచ్చింది నువ్వు చెయ్‌ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఫ్యాన్స్‌ కోర్టులోకి బంతి

ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. నేను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించాలి అని నిర్ణయం బంతిని ఫ్యాన్స్‌ కోర్టులోకి లారెన్స్‌ నెట్టారు. ఈ వీడియో చూసి అభిప్రాయాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మీరు వద్దు అని చెబితే..నేను రాజకీయాల్లోకి రాను, ఎప్పటిలాగే నా సామాజిక సేవలను కొనసాగిస్తాను. ఒకవేళ మీరు అవును అని చెబితే ప్రజాశీర్వాదంతో నా రాజకీయ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో కలిసి ప్రారంభించబోతున్నానో త్వరలోనే వెల్లడిస్తాను అని లారెన్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆయన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున రాజకీయాలలోకి రావాలని కామెంట్లు పెడుతూ మద్దతు తెలుపుతున్నారు. ఎక్కువ శాతం మంది టీవీకే విజయ్‌తో కలిసి పనిచేయాలని పిలుపునివ్వడం విశేషం. మరికొందరు మాత్రం రాజకీయాల కంటే సేవా కార్యక్రమాలే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ దృష్ట్యా, లారెన్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement