నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

● 7 రోజుల్లో వివరణకు ఆదేశం ● 16న కొత్త సభ్యులకు శిక్షణ ● స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌

సాక్షి, చైన్నె: పదవులకు రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు ప్రారంభమయ్యాయని తమిళనాడు శాసనసభ స్పీకర్‌ జె.సి.డి.ప్రభాకర్‌ స్పష్టం చేశారు. వారి రాజీనామాలకు గల కారణాలపై 7 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారిక నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం చైన్నెలోని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు.

వివాదం నేపథ్యం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మధురాంతకం –మరగదం కుమ వేల్‌, తారాపురం– సత్యభామ, పెరుందురై–జయకుమార్‌, అంబానముద్రం–ఇసక్కి సుబ్బయ్య తమ పదవులకు రాజీనామా చేసి, టీవీకే పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఈ నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే విప్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో స్పీకర్‌ ప్రభాకర్‌ వారికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సభ్యులకు శిక్షణ

తాజాగా అసెంబ్లీలో కొత్త ముఖాలే అత్యధికంగా ఉన్నాయి. వీరికి అసెంబ్లీ వ్యవహారాల గురించి ఈనెల 16, 17 తేదీల్లో శిక్షణ తరగతులకు స్పీకర్‌ నిర్ణయించారు. శిక్షణ తరగతులను సీఎం విజయ్‌కలైవానర్‌ అరంగం వేదికగా ప్రారంభిస్తారని స్పీకర్‌ ప్రభాకర్‌ తెలిపారు. సభలో సభ్యులు ఎలా నడుచుకోవాలి, అనుసరించాల్సిన పద్ధతులు, అసెంబ్లీ నిబంధనలు, చట్టపరమైన అంశాలపై అసెంబ్లీ సెక్రటరీ, నైపుణ్యం ఉన్న నిపుణులు కొత్త సభ్యులకు శిక్షణ ఇస్తారని, ఎమ్మెల్యేలందరూ తప్పకుండా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక్ష ప్రసారాలకు పరిశీలన

అసెంబ్లీ సమావేశాల వ్యవహారాలన్నీ ప్రజలందరూ చూసేలా పూర్తిస్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సభలో అధికార, ప్రతిపక్షాల సభ్యులందరి అభిప్రాయాలకు తాను సమాన గౌరవం ఇస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే గవర్నర్‌ ప్రసంగం ప్రతులను ఆయనకు అందజేస్తామన్నారు. ఈనెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నాడీఎంకే విప్‌ పదవికి సంబంధించిన అంశంపై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని, వీటిపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement