సాక్షి, చైన్నె: ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజులపాటు తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్‌సీసీ చీఫ్ చైన్నె డైరెక్టరేట్‌లో ఎన్‌సీసీ క్యాడెట్లు, అధికారులు, సిబ్బందిని కలవనున్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించేందుకు, ప్రాంతీయ ఎన్‌సీసీ కార్యక్రమాల పురోగతిని సమీక్షించనున్నారు. వీఐటీ చైన్నె క్యాంపస్‌లో సైబర్ శిక్షణను పరిశీలించనున్నారు. ఎస్‌ఆర్‌ఎంలోని ఎన్‌సీసీ మౌలిక వసతులను వీక్షించనున్నారు. చైన్నెలోని ప్రముఖ ఎంఓపీ వైష్ణవ్ మహిళా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ఆయన హాజరవుతారు. ఎన్‌సీసీలో అత్యుత్తమ సేవలందిస్తూ అసాధారణ ప్రతిభ కనబరిచిన, ఎంపిక చేసిన ఎన్‌సీసీ క్యాడెట్లు, అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్లు, సిబ్బందికి డీజీ వీరేంద్ర వత్స్ అవార్డులను అందజేయనున్నారు.


