మా పోస్టర్లు మేమే తొలగిస్తాం
తిరువొత్తియూరు: తూర్పు తాంబరంలో భారత మాతా రోడ్డులోని రైల్వేస్టేషన్ గోడలపై రాజకీయ పార్టీల నిర్వాహకులు పోస్టర్లు అంటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తాంబరం మొత్తం శుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉద యం తాంబరం కార్పొరేషన్ నగర విభాగ అధికారులు సిబ్బంది భారత మాతా రోడ్డులోని గోడలపై అంటించి ఉన్న రాజకీయ పార్టీల పోస్టర్లను చింపి తొలగించారు. ఆ సమయంలో అక్కడ డీఎంకే పోస్టర్లను తొలగించడానికి ప్రయత్నించగా, జోనల్ కమిటీ చైర్మన్ ఇందిరన్ నాయకత్వంలో డీఎంకే శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ పార్టీ పోస్టర్లను తామే తొలగించుకుంటామని, అధికారులు వాటిని ముట్టుకోకూడదని వారు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు డీఎంకే పోస్టర్లను తొలగించకుండానే వెనుదిరిగారు.
లంచం కేసులో బిల్‌కలెక్టర్ అరెస్ట్
పళ్లిపట్టు: వరి కొనుగోలుకు రైతు నుంచి లంచం తీసుకున్న బిల్ కలెక్టర్‌ను ఏసీబీ పోలీసులు గురువారం రాత్రి అరె స్టు చేశారు. ఆర్కేపేట యూనియన్‌లోని దామనేరి గ్రామంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నా రు. అందులో తాత్కాలిక బిల్‌కలెక్టర్‌గా పళ్లిపట్టు కు చెందిన సౌందర్(28) విధులు నిర్వహిస్తున్నా రు. అతను రైతుల నుంచి వరి కొనుగోలుకు లంచం డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులున్నాయి. లంచం ఇవ్వని రైతుల వరి కొనుగోలులో ఆలస్యం చేస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలో రంగాపురానికి చెందిన సెల్వం అనే రైతు వరి విక్రయించేందుకు వెళ్లగా లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. లంచం ఇష్టపడిని రైతు తిరువళ్లూలోని ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు 215 బస్తాలకు రూ.10, 750 లంచం డబ్బులు తీసుకుని గురువారం సాయంత్రం ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి సౌందర్‌కు ఇచ్చాడు. ఆసమయంలో అక్కడే వున్న ఏసీబీ సీఐ తమిళరసి, బృందం సభ్యులు సౌందర్‌ను రెడ్‌హ్యేండడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. తిరువళ్లూరు కోర్టులో హజరుపరిచి పుళళ్ జైలుకు తరలించారు.
లారీడ్రైవర్ దారుణ హత్య
తిరువొత్తియూరు: లారీడ్రైవర్ తల నరికిన స్థితిలో దారుణ హత్యకు గురయ్యాడు. తెన్కాసి జిల్లా కడయనల్లూర్ సమీపం కరడి కుళం గ్రామానికి చెందిన మారిముత్తు (35) లారీడ్రైవర్. ఇతని భార్య ఇసైక్కలై, కుమారుడు మిథున్ రాహుల్, కుమార్తె అనన్య. గురువారం రాత్రి మారిముత్తు బైక్‌లో పొయ్‌గై ప్రాంతానికి వెళుతున్నాడు. కరుప్పన్ ఆలయానికి వెళ్లే రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను అడ్డుకున్నారు. మారిముత్తును వేటకొడవళ్లతో నరికి, చంపి తలని శరీరం నుంచి వేరు చేసి పారిపోయారు. విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహించిన మారిముత్తు బంధువులు, స్థానికులు నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వారితో చర్చలు జరిపి రాస్తారోకో విరమింపజేశారు. హంతకులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తిరువలంగాడులో నగలు చోరీ
తిరుత్తణి: తిరువలంగాడులో ఇంటి తలుపులు పగులగొట్టి దుండగులు 15 సవర్ల నగలు చోరీ చేశారు. తిరువలంగాడు కూడల్‌వాడి గ్రామానికి చెందిన శివకుమార్(55). ఇతను తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీలో కార్యాలయ సిబ్బందిగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఇంట్లో శివకుమార్, భార్య భవాని నిద్రిస్తున్నారు. ఈక్రమంలో ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని 15 సవర్ల నగలు, రూ.30 వేల నగదు చోరీ చేసుకెళ్లారు. శుక్రవారం ఉదయం శివకుమార్ నిద్ర లేచి చూసి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువలంగాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్
తిరువొత్తియూరు: పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్‌కు గురయ్యారు. తెన్కాసి జిల్లా సెంగోట్టైలోని ఎస్‌ఆర్‌ఎం ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలలో 2వేల మందికి పైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. పురాతనమైన ఈ పాఠశాల భవనం గోడలపై నాచు పేరుకుపోయి, శిథిలాస్థకు చేరుకుంది. అంతేకాకుండా, పాఠశాల ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలోని ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాలని, భవనానికి మరమ్మతు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలు జీవాకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె దీనిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఆమైపె మరిన్ని ఆరోపణలు రావడంతో, ఈ విషయాన్ని సీఈఓ రేణుక దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం, జీవాను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


