కీర్తిచక్ర వీరుడికి బ్రహ్మరథం | - | Sakshi
Sakshi News home page

కీర్తిచక్ర వీరుడికి బ్రహ్మరథం

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

● మీనాక్షి సుందరానికి ఘన స్వాగతం

సాక్షి, చైన్నె: దేశ రక్షణలో అద్వితీయ సాహసాన్ని ప్రదర్శించి, భారత సైన్యపు అత్యున్నత పురస్కారమైన ‘కీర్తి చక్ర’ అందుకున్న తమిళనాడు వీరజవానుకు స్వగ్రామంలో అపూర్వస్వాగతం లభించింది. తేని జిల్లా కంబం సమీపంలోని కామయగవుండన్‌పట్టి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ మీనాక్షిసుందరం (33) సెలవులపై శుక్రవారం మధ్యా హ్నం తన స్వగ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థు లు, మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాణసంచా కాలుస్తూ, సంప్రదాయ డప్పు వాయిద్యాల ఆయనకు పూలమాలలు వేసి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు.

ఉగ్రవాదులను హతమార్చిన సాహసం

లాన్స్‌ నాయక్‌ హోదాలో ఇండియన్‌ ఆర్మీకి చెందిన కశ్మీర్‌ రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగంలో మీనాక్షి సుందరం సేవలందిస్తున్నారు. 2025 డిసెంబర్‌ 19న దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఐదుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు, భారత సైన్యానికి మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ పోరాటంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మీనాక్షి సుందరం కుడి భుజం, నోటి భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావమవుతున్నా, ప్రాణా పాయ స్థితిలోనూ ఆయన వెనకడుగు వేయలేదు. అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడి, ఆ ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా, తన బృందంలోని తోటి సైనికుల ప్రాణాలను కాపాడారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం

ఆయన ప్రదర్శించిన ఈ వీరోచిత సాహసానికిగానూ భారత ప్రభుత్వం ‘కీర్తి చక్ర’ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం ఏడుగురు వీరజవాన్లకు ఈ పురస్కారం దక్కగా, అందులో తమిళనాడు నుంచి ఎంపికైన ఏకై క వీరుడు మీనాక్షిసుందరం. ఈనెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అధికారిక వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అత్యున్నత అవార్డును అందుకున్నారు.

గ్రామస్తుల ఆనందోత్సాహాలు.. ఊరేగింపు

అవార్డు అందుకున్న తర్వాత మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన మీనాక్షి సుందరానికి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికి గ్రామస్తులు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో సత్కరించి, గ్రామంలో ఘనంగా ఊరేగించారు. స్థానిక మాజీ సైనికులు మాట్లాడుతూ అత్యంత వీరత్వానికిగానూ భారత సైన్యం అందించే పురస్కారాలలో ‘అశోక చక్ర’ తర్వాత స్థానంలో ఉండే అత్యున్నత అవార్డు ఈ ‘కీర్తి చక్ర’ అని, అలాంటి ప్రతిష్టాత్మక అవార్డును తమ గ్రామానికి చెందిన బిడ్డ కై వసం చేసుకోవడం తమందరికి, దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement