సాక్షి, చైన్నె : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్క్కృతిక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోషెఫ్ విజయ్ ప్రపథమంగా గురువారం హాజరయ్యారు. ఆయన ఇందులో కీలక ప్రసంగం చేశారు. తమిళనాడు ప్రజలు తమ ప్రభుత్వానికి చారిత్రాత్మక తీర్పునిచ్చారని గుర్తు చేస్తూ.. రాష్ట్ర హక్కులను కాపాడుకుంటూనే, కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమిళనాడు వృద్ధి రేటును, దేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నీతి ఆయోగ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధానాంశాలు, డిమాండ్లు వివరాలను చైన్నెలోని సచివాలయం ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే , సమసమాజ, సగర్వ భారతదేశాన్ని నిర్మించగలం అని ఈ సమావేశంలో విజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం విజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పీఎం మోదీతో సీఎం విజయ్
విజ్ఞప్తులు.. డిమాండ్లు
2036 నాటికి 1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పేర్కొంటూ, భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తమిళనాడు దూసుకుపోతోందన్నారు. తమ లక్ష్య దార్శనికత అన్నది యువత, పేదలు, మహిళలు, రైతులు అనే నాలుగు ముఖ్య స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు.
వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం కేంద్రం నిర్వహి స్తున్న నీట్ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. గ్రామీణ, సామాజిక, ఆర్థికంగా వెనుకబడి విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తూ, ప్లస్‌టూ మార్కుల ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు తమిళనాడుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని విన్నవించారు.
ఏడాదికి 5 లక్షల మంది యువతకు స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్య శిక్షణ అందించేందుకు యువ నైపుణ్య – ఉపాధి మిషన్‌కు శ్రీకారం చుట్టనున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాల్లో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర సాయం చేయాలని కోరారు.
కోయంబత్తూరులో రాష్ట్ర ప్రభుత్వ స్థలంలో రెండో ఎయిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పేదరిక నిర్మూలనలో భాగంగా తమిళనాడులో అర్హులైన కుటుంబాలను గుర్తించి, అందరికీ ఇళ్లు, స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు పేద రహిత తమిళనాడు ఉద్యమంకు శ్రీకారం చుట్టనున్నామని ప్రకటించారు.
మహిళా భద్రతకు సింగప్పెన్ రంగంలోకి దిగినట్టు గుర్తు చేస్తూ, తమిళనాడులోనే అత్యధికంగా 42 శాతం మంది మహిళలు వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
రైతుల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం ఇటీవల రూ.2,045 కోట్ల సహకార పంట రుణాలను మాఫీ చేసినట్లు గుర్తుచేస్తూ, మత్స్యకారులకు రక్షణ కల్పించాలని, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవలను విడుదల చేయించాలని కోరారు.
తమిళనాడు ఆర్థిక వృద్ధికి కీలకమైన పలు జాతీయ రహదారులు ఎన్ హెచ్ 32, ఎన్‌హెచ్ 81,87 లను , చైన్నె – కన్యాకుమారి హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, రహదారుల శాఖలను కోరారు.
కొత్త విద్యా విధానం లేదా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలనే నిబంధనలు పెట్టకుండా, తమిళనాడు కు రావాల్సిన రూ.3,284 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హొగ్నెకల్ 3వ విడత ఉమ్మడి తాగునీటి పథకానికి కేంద్రం వాగ్దానం చేసిన రూ.2,283.40 కోట్ల నిధులను మంజూరు చేయాలన్నారు.
కులశేఖరపట్నంలో ఇస్రో భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను జాతీయ స్పేస్‌ట ఉత్పాదక కేంద్రం’గా ప్రకటించాలని కోరారు.
భారతదేశ లౌకిక విలువలకు అద్దం పట్టే ప్రపంచ ప్రసిద్ధ, అత్యంత పురాతనమైన తమిళ గ్రంథం ’తిరుక్కురళ్’ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలి.


