సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ కమిటీలో త్వరలోనే భారీ నాయకత్వ మార్పు జరగబోతున్నట్లు కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కె. సెల్వపెరుంతొగై స్థానంలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన విరుదునగర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సంకేతాలువెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలను పునర్వ్యవస్థీకరించి, పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని ఏఐసీసీ భావిస్తున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడులో కూడా ఈ మార్పు జరగబోతోందన్న చర్చ జరుగుతున్నది.
సెల్వపెరుంతొగై రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగబోనని సెల్వపెరుంతొగై ఇదివరకే ప్రకటించారు. అధికారికంగా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సరికొత్త రాజకీయ సమీకరణాలు ,కూటములు తెరపైకి వచ్చాయి. ఇలాంటి కీలక సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తులలో పడింది.
రేసులో..
సెల్వపెరుందగై స్థానాన్ని భర్తీ చేయడానికి ఢిల్లీ పెద్దలు మాణిక్యం ఠాగూర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడు, నమ్మకమైన కోర్ టీమ్ మెంబర్‌గా గుర్తింపు పొందారు. ఢిల్లీ రాజకీయాలతో పాటూ ఇతర రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయడంలో, దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డీఎంకేను ఆది నుంచి విమర్శించడమే కాకుండా, ఆ పార్టీ వర్గాలకు మాటకు మాట అన్నట్టుగా సమాధానాలు ఇవ్వడంతో మాణిక్యం ముందుంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో డీఎంకేను ఢీ కొట్టాలంటే మాణిక్యం ఠాగూర్ పార్టీకి నాయకత్వం వహిండం ద్వారానే సాధ్యమన్న నిర్ణయానికి ఏఐసీసీ వర్గాలు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి.


