డీఎంకే కూటమిలో లేం! | - | Sakshi
Sakshi News home page

డీఎంకే కూటమిలో లేం!

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

● టీవీకే ప్రభుత్వానికి బయట నుండే మద్దతు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల అనంతరం సమీకరణాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఉన్న పొత్తులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. తాజా పరిణామాలపై భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీఐ) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్‌ గురువారం స్పష్టత నిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము డీఎంకే కూటమిలో కొనసాగడం లేదని ఆయన అధికారికంగా ప్రకటించారు. కోయంబత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళం , తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులో పొత్తుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. డీఎంకే కూటమి నుండి కాంగ్రెస్‌ ఇప్పటికే తప్పుకుందని గుర్తు చేశారు. డీఎంకే కూడా తాము ఇండియా కూటమిలో భాగం కాబోమని ప్రకటించిందన్నారు. ఇలాంటి మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, ప్రస్తుతానికి తాము డీఎంకే కూటమిలో లేమని స్పష్టం చేశారు.

టీవీకేకు బయటి నుంచే మద్దతు

కొత్తగా ఏర్పడిన విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి తాము బయటి నుండే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని లెఫ్ట్‌ పార్టీలకు తానే చెప్పానంటూ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను వీరపాండియన్‌ తప్పుబట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీలో సుదీర్ఘంగా చర్చించి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది ఆయా సమయాల్లో నిర్ణయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ కూడా తమిళనాడు ద్విభాషా విధానానికి కట్టుబడి ఉండాలని సూచించారు. తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే , టీవీకే పార్టీలను తాము ప్రజాస్వామ్య శక్తులుగానే చూస్తామన్నారు. దేశ ప్రయోజనాల కోసం వారితో కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తమకు ఉన్న ఏకై క సిద్ధాంత శత్రువు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం విజయ్‌ తరచూ ప్రెస్‌ మీట్లు పెట్టి మీడియాతో మాట్లాడాలని, అదే నిజమైన ప్రజాస్వామ్యమని హితవు పలికారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement