పోలీసులే కిడ్నాపర్లు..! | - | Sakshi
Sakshi News home page

పోలీసులే కిడ్నాపర్లు..!

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

● కోవైలో మాయజాలం ● ఇద్దరు యువకుల నుంచి రూ.50 లక్షల డిమాండ్‌

సాక్షి, చైన్నె: కోయంబత్తూరు జిల్లాలో గత రెండు రో జులుగా కలకలం రేపుతూ వచ్చిన కిడ్నాప్‌ కేసును పోలీసులు చేదించారు. ఈ కిడ్నాప్‌ ఉదంతంలో నిందితులు మరెవరో కాదు.. సాక్షాత్తు శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అని గురువారం తేలడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

కిడ్నాప్‌..

కోయంబత్తూరు పోతనూర్‌ సమీపంలోని సిద్ధన్నపురం ప్రాంతానికి చెందిన నవీన్‌ (29) అనే యువకుడు వెల్లలూర్‌ హౌసింగ్‌ యూనిట్‌ ఏరియాలో ఉంటూ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ వ్యాపారం చేస్తున్నాడు. జూన్‌ 8వ తేదీ మధ్యాహ్నం నవీన్‌ సోదరి పరమేశ్వరి మొబైల్‌కు ఒక అపరిచిత నంబర్‌ నుండి ఫోన్‌ వచ్చింది. ‘నీ తమ్ముడు నవీన్‌ను మేము కిడ్నాప్‌ చేశాం.. వాడు ప్రాణాలతో తిరిగి రావాలంటే వెంటనే రూ.50 లక్షలు సిద్ధం చేయాలి‘ అని అవతలి వ్యక్తి బెదిరించి ఫోన్‌ కట్‌ చేశాడు. ఆందోళనతో పరమేశ్వరి తమ్ముడి ఇంటికి వెళ్లి చూడగా.. ఇల్లు లాక్‌ చేసి ఉండటం, అతని ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో కలవరంలో పడింది. అదే సమయంలో నవీన్‌ స్నేహితుడైన నిర్మల్‌ కుమార్‌ (29) భార్య జెనితా కూడా తన భర్త కనిపించడం లేదంటూ పరమేశ్వరిని సంప్రదించింది. అదే రోజు రాత్రి నవీన్‌ ఫోన్‌ నంబర్‌ నుండి నిర్మల్‌ భార్య జెనితాకు మళ్లీ కిడ్నాపర్ల ఫోన్‌ వచ్చింది. ఇద్దరు యువకులూ తమ ఆధీనంలో ఉన్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇద్దరినీ చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించారు.

నిందితులు పోలీసులే..

బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోతనూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్లు మాట్లాడిన సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా, ఘటనా స్థలాల్లోని సీసీటీవీ విజువల్స్‌ పరిశీలించి పోలీసులు తిరుపూర్‌లో నిందితులను పట్టుకునేందుకు పక్కా ప్లాన్‌ వేశారు. బుధవారం రాత్రి డబ్బులు తీసుకునేందుకు తిరుపూర్‌ నల్లూరు ప్రాంతానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా షాకింగ్‌ సమాచారం తప్పలేదు. పట్టుబడిన ఆ ఇద్దరూ తిరుపూర్‌ నల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న మోహన్‌, ఆనంద్‌గా తేలింది. ఇద్దర్నీ అరెస్టు చేసి విచారించగా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో చేతుల నిండుగా ఆర్జిస్తున్న ఈ ఇద్దర్ని కిడ్నాప్‌ చేసి పెద్ద మొత్తాన్ని రాబట్టే ప్రయత్నం చేసినట్టు తేలింది.

వీరు ఇచ్చిన సమాచారంతో తిరుప్పూర్‌కు చెందిన కాళిదాసు, ఆనందన్‌ మోహన్‌, రామ్‌కుమార్‌లతో పాటుగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. వీరి చెర నుంచి ఆ ఇద్దర్నీ రక్షించారు. పట్టుబడ్డ కానిస్టేబుళ్లు ఇద్దర్నీ సస్పెండ్‌ చేస్తూ, తిరుపూర్‌ పోలీసు కమిషనర్‌రాజేంద్రన్‌ ఆదేశాలు ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement