కార్మికుడిపై ఎస్‌ఐ కాల్పులు కేసు | - | Sakshi
Sakshi News home page

కార్మికుడిపై ఎస్‌ఐ కాల్పులు కేసు

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

● కోర్టు ఆగ్రహం ● సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు

సాక్షి, చైన్నె: తమిళనాడులోని తెన్కాశి జిల్లాలో కార్మికుడి పై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనపై మదురై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక పోలీసుల విచారణపై నమ్మకం లేదంటూ బాధితుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయ స్థానం ఈ కేసును తక్షణమే సీబీసీఐడీ దర్యాప్తునకు బదిలీ చేస్తూ గురువారం సంచలన తీర్పునిచ్చింది.

అసలు ఏం జరిగిందంటే..?

తెన్కాశి జిల్లా ఆలంగుళం సమీపంలోని మరుతం పూత్తూరు గ్రామానికి చెందిన పెరుమాళ్‌ సేట్‌ కుమారుడు మణికంఠన్‌. ఇతను తాటి నుంజులు, నీరా, పదనీర్‌(కల్లు) తీసే వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాడు. ఏప్రిల్‌ 7వ తేదీన ఆలంగుళం పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇసక్కిరాజా కొందరు పోలీసులు సివిల్‌ డ్రస్‌లో మణికంఠన్‌ ఇంటికి వచ్చారు. తాటి చెట్లకు కట్టిన కుండల్లో కల్లు ఉందా లేదా నీరా ఉందా అని తనిఖీ చేయాలంటూ మణికంఠన్‌ను బలవంతంగా తోటలోకి తీసుకెళ్లారు.

కుల వివక్షతో కాల్పులు

మణికంఠన్‌ చెట్టు ఎక్కుతున్న సమయంలో ఎస్‌ఐ ఇసక్కిరాజా అతనిని కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని అక్కడే ఉన్న మణికంఠన్‌ తండ్రి, అతని కూతురు నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్‌ఐ, మణికంఠన్‌ చెట్టు దిగి కిందకు రాగానే తన వద్ద ఉన్న తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మణికంఠన్‌ రెండు కాళ్లకు తీవ్ర బుల్లెట్‌ గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

హైకోర్టును ఆశ్రయించిన తండ్రి

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, నిందితుడు అదే పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ కావడంతో స్థానిక పోలీసుల విచారణ వల్ల తమకు న్యాయం జరగదని మణికంఠన్‌ తండ్రి పెరుమాళ్‌ సేట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ లేదా మరేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలంటూ ఆయన హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ గురువారం న్యాయమూర్తి పుగళేంది ఎదుట విచారణకు వచ్చింది. బాధితుడి తరపు వాదనలను విన్న న్యాయమూర్తి, పిటిషనర్‌ అభ్యర్థనను అంగీకరించారు. ఒక సామాన్య కార్మికుడిపై పోలీసు అధికారి కాల్పులు జరపడం తీవ్రమైన విషయమని భావిస్తూ.. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించేందుకు వీలుగా విచారణ బాధ్యతలను సీబీసీఐడీ విభాగానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement