ఐరాల: మండలంలోని నాంపల్లెలో దౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో నిర్వహిస్తున్న మహా భారత యజ్ఞంలో భాగంగా గురువారం దుర్యోధన వధ ఘట్టం ప్రదర్శించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు శ్రీకృష్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ ఉత్సమూర్తులను ఊరేగించారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో మట్టితో దుర్యోధనుడి ప్రతిమను రూపొందించారు. గంగ మడుగులో దాగి ఉన్న దుర్యోధనుడిని రెచ్చగొట్టి భీముడు బయటకు తీసుకువచ్చి హతమార్చడం మహాభారత గాథ. ఈ ఘట్టాన్ని కళాకారులు రౌద్రంగా కలియబడుతూ, గదాయుద్ధం చేస్తూ, తమ ప్రదర్శనతో రక్తి కట్టించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన జనంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.


