తిరువళ్లూరు: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డును ఆక్రమించుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఏర్పాటు చేసిన పలు దుకాణాలను రెవెన్యూ అధికారులు ఉద్రిక్తతల నడుమ గురువారం ఉదయం తొలగించారు. పట్టణంలోని సీవీ నాయుడు, జేఎన్ రోడ్డు, మాడవీధి, బజారువీధిలో రోడ్డుకు ఇరువైపులా పూలు, పండ్ల దుకాణాలు, చిన్నపాటి టిఫెన్ సెంటర్‌లు, కూరగాయల విక్రయాల దుకాణాలు వెలిశాయి. రోడ్డుకు ఇరువైపులా వెలిసిన దుకాణాలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతోపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా వున్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ కవితకు వినతులు వచ్చాయి. దీంతో తిరువళ్లూరు ఆర్డీఓ రవిచంద్రన్, తహసీల్దార్ బాలాజీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రెండు రోజుల నుంచి ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇందులోభాగంగానే గురవారం ఉదయం పుష్కరిణి వీధుల్లో అక్రమ కట్టడాలను తొలగించారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో ఉద్రిక్తతల నడుమ ఆక్రమణలను తొలగించారు.


