తిరువళ్లూరు: కలెక్టరేట్‌లో ఆవరణలో బాంబు పెట్టినట్టు అగంతకుడి నుంచి వచ్చిన ఈ–మెయిల్ బాంబు బెదిరింపులతో కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం కలకలం రేపింది. తిరువళ్లూరు కలెక్టరేట్‌కు నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలు, జిల్లాకు చెందిన పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల రాకపోకలతో నిత్యం రద్దీగా వుంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ–మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చింది. కలెక్టరేట్‌లోని ప్రహరీగోడ వద్ద బాంబు పెట్టామని, త్వరలోనే పేల్చేస్తామని ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. సమాచారం అందిన వెంటనే పోలీసులకు కలెక్టరేట్ సిబ్బంది అప్రమత్తం చేయడంతోపాటు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన బాంబుస్క్వాడ్ అధికారులు అన్ని ప్రాంతాలను అణుఅణువునా గాలించారు. కలెక్టరేట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత బాంబు బెదిరింపు నకిలీగా భావించిన పోలీసులు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నిత్యం రద్దీగా వుండే కలెక్టరేట్‌లో పోలీసులు, బాంబు తనిఖీ బృందం హఠాత్తుగా రంగంలో దిగి గాలింపు చర్యలు చేపట్టం కలకలం రేపింది.


