అన్నానగర్: బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పెరియపాలయం సమీపంలోని పనప్పాక్కం గ్రామంలోని వినాయగర్ కోవిల్ వీధిలో నివసించే రితిశ్రీ (20). ఇతను రెడ్‌హిల్స్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. బుధవారం ఉదయం ఇతను రెడ్‌హిల్స్ నుంచి బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. పెరియపాలయం–చైన్నె జాతీయ రహదారిపై జయపురం వద్ద వెళుతుండగా, రోడ్డు పనుల కోసం మళ్లించిన మార్గంలో బైకులో వచ్చాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో రితిశ్రీ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరువళ్లూరు: బీజేపీ నుంచి వైదొలగిన మాజీ చీఫ్ అన్నామలై కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి తనతో కలిసి నడవడానికి ఆసక్తిగా వున్న వారిని సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నామలైకు మద్దతుగా బీజేపీతోపాటు అన్నాడీఎంకేలోని కొందరు నేతలు ముందుకొచ్చారు. అన్నామలైకు మద్దతుగా ఆన్‌లైన్‌లో 20 లక్షల మంది సభ్యులుగా చేరిన క్రమంలో తిరువళ్లూరు జిల్లాకు చెందిన నేతలు సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా సభ్యులను చేర్చారు. అన్నామలై మద్దతుదారులకు సైతం స్థానికులు, యువకుల నుంచి మంచి స్పందన లభించింది.
తిరుత్తణి: పళ్లిపట్టు యూనియన్‌లోని మేళపూడి దళితవాడకు చెందిన మహిళలు వందమంది బుధవారం తిరుత్తణిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కణిమొళిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తమ గ్రామంలో 150కు పైబడిన కుటుంబీకులం నివశిస్తున్నామని, చాలా మందికి ఇంటి పట్టాలు లేక పోవడంతో ప్రభుత్వ సహాయకాలు పొందడం కష్టం వుందని వాపోయారు. స్పందించిన ఆర్డీఓ విచారణ చేపట్టి అర్హులకు ఉచిత ఇంటి పట్టాలతో పాటూ నివాస కుటుంబాలకు పట్టాలు అందజేస్తామని తెలిపారు.
సాక్షి, చైన్నె: కలెక్టర్లు, ప్లేయర్లు, ఇన్వెస్టర్లు, హాబీ ప్రియుల కోసం దేశంలోని తొలిసారిగా అధికారిక ట్రేడింగ్ కార్డ్ ప్రదర్శనకు చర్యలు తీసుకున్నట్టు కార్డ్ షో సహ వ్యవస్థాపకుడు ఎస్ సాగర్ పిలుపు నిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జూన్ 14వ తేదీ ఆదివారం బెంగళూరు, బనశంకరిలోని ఆదిసంకల్ప్ బ్యాంకెట్ హాల్‌శ్రీ లో నిర్వహించనున్నామని స్థానికంగా బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కలెక్టబుల్స్ పరిశ్రమను ఒకే తాటిపైకి తెస్తూ.. పోకీమాన్ స్పోర్ట్స్, కార్డ్స్, ట్రేడింగ్ కార్డ్ గేమ్స్, యానిమే కార్డ్స్, ఇతర అరుదైన కలెక్టబుల్స్ ప్రియుల కోసం ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. దేశం నలు మూలల నుంచి వెండర్లు, కలెక్టర్లు తమ వద్ద ఉన్న అరుదైన ట్రేడింగ్ కార్డ్‌లను, ప్రత్యేక ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారన్నా రు. ఇక్కడి హాబీ ప్రియులు తమకు నచ్చిన కార్డ్‌లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి లేదా పరస్పరం మార్చుకోవడానికి అవకాశం కల్పించామని ప్రతిఒక్కరూ తరలి రావొచ్చునని పిలుపునిచ్చారు.
తిరువొత్తియూరు: బాలికపై లైంగక వేధింపులకు పాల్పడిన ఓ ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విల్లుపురం జిల్లా సెంచి సమీపంలోని పెరియనోనంబై గ్రామానికి చెందిన పాల్ దినకరన్ (41) చైన్నెలో 108 అంబులెన్‌న్స్ డ్రైవర్. ఇతని భార్య గర్భవతి కావడంతో తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కం సమీపంలోని తన పుట్టింట్లో ఉంటోంది. భార్యను చూడడానికి పాల్ దినకరన్ తరచూ అక్కడికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో గత 4వ తేదీన అదే వీధిలో అనుకుంటున్న బాలికను రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్లి లైంగిక వేధింపులు ఇచ్చాడు. విషయం తెలిసి బాలిక తల్లి పోలురు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలూరు మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పాల్ దినకరన్‌న్‌ను అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అతడిని తిరువణ్ణామలై పోక్సో కోర్టులో హాజరుపరిచి, అనంతరం ఆదేశాల మేరకు వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


