క్షేత్ర స్థాయి పరిశీలన
సాక్షి, చైన్నె: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించలేక అధికారాన్ని కోల్పోయిన డీఎంకే పార్టీ తన ఓటమికి గల కారణాలపై క్షేత్రస్థాయి పరిశోధన పూర్తి చేిసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్‌కు సమర్పించారు.
ఓటమిపై అధ్యయనం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయి విశ్లేషణ కోసం డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ గత నెల 14వ తేదీన 36 మంది సభ్యులతో కూడిన 19 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈబృందాల సభ్యులు నియోజకవర్గాల వారీగా పర్యటించి, స్థానిక నిర్వాహకులు, వాలంటీర్ల అభిప్రాయాలను సేకరించి నివేదికను సిద్ధం చేశారు. బుధవారం ఈబృందం సభ్యులు ఆల్వార్‌పేటలోని ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లి నివేదికను అధికారికంగా అందజేశారు.
నివేదికలో ఓటమికి ప్రధాన కారణాలు
ఎన్నికల సమయంలో అనేక నియోజకవర్గాల్లో మిత్రపక్షాల నుండి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని ఈ నివేదిక తేట తెల్లం చేసింది. కూటమి పార్టీల సహకారం అన్నది అనేక నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో లేనట్టు తేలింది. గతంలో మంచి ఓట్లు సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, సరైన కారణం లేకుండా కొత్త ముఖాలకు సీట్లు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కూడా ఓటమికి కారణంగా వెలుగు చూసింది. మరికొన్ని చోట్ల అంతర్గత కుమ్ములాటల వలన ఓట్లు నష్టపోయినట్టు గుర్తించారు.
నిర్లక్ష్యం
ఎన్నికల సమయంలో పలువురు నేతలు, బాధ్యులు క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి జరిగినట్టు గురితచారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఒంటరిగానే పోటీ చేయాలని మెజారిటీ వాలంటీర్లు పట్టుబడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూటమి పార్టీలకు సీట్లు ఇచ్చేటప్పుడు.. ఆయా నియోజకవర్గాల్లో సదరు పార్టీలకు నిజంగానే పలుకుబడి ఉందా, గెలిచే సత్తా ఉందా అనే విషయాలను కింది స్థాయి నుండి విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నివేదికలో సూచించారు. ప్రతి రెండు శాసనసభ నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ నివేదిక సమర్పణ సందర్భంగా స్టాలిన్ తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం స్టాలిన్ నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. రాజా, ఎం.ఆర్. పన్నీర్‌సెల్వం తదితరులు పాల్గొన్నారు. ఈ క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా త్వరలోనే బాధ్యులైన వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే సమాచారాలు వెలువడుతున్నాయి.


