మోటారు సైకిల్ సీజ్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లాలోని తాయిమాంబపురం వద్ద 77 ఎర్రచందనం దుంగలతోపాటు, ఒక కారు, మోటారు సైకిల్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆర్‌ఎస్‌ఐ కేఎస్‌కే లింగాధర్ బృందం, ఎఫ్‌ఆర్‌ఓ సుభాష్‌తో కలసి తిరుపతి డివిజన్ పుత్తూరు రేంజ్ నారాయణవనం బీట్‌కు మంగళవారం రాత్రి చేరుకున్నారు. పుత్తూరు–నేసనూరు మార్గంలోని తాయిమాంబపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బుధవారం తెల్లవారుజామున ఒక మోటారు సైకిల్, దాని వెనుక ఒక కారు వేగంగా రావడంతో అనుమానం వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ వాహనాలను అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ వాహనాలు కొద్దీ దూరంలోనే ఆపి పారిపోతున్న కొందరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. వారిలో ఒకరిని పుత్తూరు మండలానికి చెందిన వ్యక్తిగా, మరొకరు తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన వ్యక్తిగా గుర్తించి, అరెస్టు చేశారు. నిందితులసహా వాహనాలు, దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఖాదర్ బాషా తెలిపారు.


