తమిళసినిమా: తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరానికి చెందిన ఓ సాధారణ కుటుంబమైన పెరియ మాయదేవర్, మీనాక్షి అమ్మాళ్‌ల నలుగురు సంతానంలో ఒకరే భారతీ రాజా. 1941 జూలై 17న జన్మించారు. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి కలగడంతో నాటకాలు చూస్తూ పెరిగారు. అది నాటకాలు ఆడేంతలా కథలను రాసే స్థాఽయికి జ్ఞానాన్ని పెంపొందింది. విద్యను పూర్తి చేసిన భారతీరాజా హెల్త్ ఆఫీసర్‌గా ప్రభుత్వ కొలువులో చేరారు.
పన్నైపురం నుంచి చైన్నె వైపుగా..
పన్నైపురంలో జరిగిన సంగీత కచ్చేరి ఇఽళయరాజా, గంగైఅమరన్, భాస్కర్‌ను కలిసే సందర్భం ఆయనకు కలిగింది. అలా వారు స్నేహితులుగా మారారు. ఆ తరువాత భారతీరాజా దర్శకత్వం వహించిన ఊర్ సిరిక్కిరదు, సుమ్మా ఒరు కథై నాటకాలు కొత్తగా ఉండటంతో వీరి నాటకాల ఆసక్తిని చూసిన కమ్యునిస్ట్ పార్టీ నేత శంకరయ్య అన్న కొడుకు అన్నక్కిళి సెల్వరాజ్ స్నేహితుడిగా మారారు. వీరంతా సినిమాల్లోకి వెళ్లితే మంచి పేరు తెచ్చుకోవచ్చునని భావించారు. అలా ఇళయరాజా, గంగైఅమరన్, భారతీరాజా చైన్నెకి వచ్చారు. వీరిలో భారతీరాజా ప్రముఖ దర్శకుడు పుట్టన్న కనక వద్ద సహాయకుడిగా చేరారు. అలా ఆయన దర్శకత్వం వహించిన ఇరుళుమ్ ఒళియుమ్ అనే చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తరువాత కేఆర్‌జీ నిర్మించిన అదృష్టం అళైక్కిరదు చిత్రానికి ఏ .జగన్నాధన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. భారతీరాజ ప్రతిభను గుర్తించిన నిర్మాత కేఆర్‌జీ ఆయనకు దర్శకత్వం అవకాశం కల్పించారు. ముత్తురామన్, జయలలిత జంటగా నటించనున్న ఆ చిత్రానికి సొంత వీడు అనే టైటిల్‌ను నిర్ణయించారు. అయితే చిత్ర షూటింగ్ ప్రారంభానికి ముందే నటి జయలలిత చిత్రం నుంచి వైదొలగడంతో ఆ చిత్రం డ్రాప్ అయ్యింది. ఆ తర్వాత లభించిన అవకాశంతో 16 వయదినిలేతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు భారతీరాజా. ఆ తరువాత ఎస్‌ఏ.రాజకన్న సంస్థలో సుధాకర్, రాధిక జంటగా నటించిన కిళక్కు పోగుం రైయిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రంతో నటి రాధికను పరిచయం చేశారు. ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత కమలహాసన్, శ్రీదేవి జంటగా శివప్పు రోజాగళ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ సూపర్‌హిట్ అయ్యింది. ఆ తరువాత తన శిష్యుడు కే.భాగ్యరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పుదియ వార్పుగళ్ చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం ద్వారా భారతీరాజా నిర్మాతగానూ మారారు. అలా వరుసగా విజయాలను సాఽధిస్తున్న భారతీరాజా కళ్లుక్కుల్ ఈరం అనే చిత్రం ద్వారా కథానాయకుడిగానూ పరిచయం అయ్యారు.
అవార్డుల రారాజు..
కాగా ఈ చిత్రం ఉబ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికై ంది. భారతీరాజా తన తల్లి పేరుతో తెరకెక్కించిన కరుత్తమ చిత్రానికి జాతీయఅవార్డు రాగా, ఆ అవా ర్డును భారతీరాజా తల్లి అందుకోవడం విశేషం. ఈ చిత్రం భారతీరాజాకు ఉత్తమ నిర్మాత, దర్శకుడిగా జాతీయ అవార్డును అందించింది. 2004లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెలుగు చిత్రం సీతాకోక చిలుక చిత్రానికి గానూ 1982లో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. 1988లో వేదంపుదిదు చిత్రం కూడా జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. 1996లో అందిమందామరై చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. పల్లెవెలుగులను తెరపై
ఆవిష్కరించిన దర్శకుడు
తమిళనిసిమాను భారతీరాజాకు ముందు, ఆ తరువాత అంటారు. అంతకు ముందు వరకూ స్టూడియోలకే పరిమితం అయిన తమిళ సినిమాను బాహ్య ప్రపంచంలోకి తీసుకు వచ్చిన దర్శకుడు భారతీరాజా. ముఖ్యంగా మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేసి విజయాలను సాధించారు. అయితే, గత ఏడాది వారసుడు మనోజ్ హఠాన్మరణం ఆయన్ని ఎంతగానో కృంగదీసింది. అంతకు ముందు ఉత్సాహంగా సినిమాల్లో నటించిన ఆయన ఆరోగ్యం కుంటుపడింది. కొంత కాలం వైద్య చికిత్స ఆయన్ని కాపాడినా, ఇంటిలోనే ఉంటూ వచ్చారు. అలాంటిది బుధవారం వేకువ జామున కన్నుమూశారు. దీంతో మలేషియాలో నివశిస్తున్న కుమార్తె జనని వెంటనే చైన్నెకి చేరుకున్నారు. కాగా భారతీరాజా మృతి యావత్ సినీ లోకానికి తీరని లోటు అని నటీ నటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు కొనియాడారు. తమిళనాడు గవర్నర్ ఆర్వీ అర్లేకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, నటుడు విశాల్, ఆర్ కె సెల్వమణి తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతీరాజా మృతికి సంతాపంగా గురువారం షూటింగ్‌లను రద్దు చేశారు.
భారతీయ సినీ పరిశ్రమ దిగ్గజ దర్శకుడు భారతీరాజా సేవలను బుధవారం కోల్పోయింది. భారతీరాజా అనేది పేరు కాదు. ఒక బ్రాండ్. ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్ధాయిలో చాటిన దర్శక హిమయం. వర్ధమాన దర్శకులకు ఆయన చరిత్ర ఒక పుస్తకం. భారతీరాజా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ముందుగా ఎన్ ఇనియ తమిళ్ మక్కలే (నా ప్రియమైన తమిళ్ ప్రజలే) అంటూ సంబోధించే వారు. ఇప్పుడు ఆ గళం మూగబోయింది.
పలు భాషలలో ముద్ర
తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ వంటి భాషల్లోనూ భారతీరాజా తన జెండా పాతారు. మొత్తం 44 చిత్రాలకు పైగా దర్శకత్వం వహి ంచారు. వాటిలో టిక్ టిక్ టిక్, కాదల్ ఓవియం, వాలిభమే వావా, మన్‌వాసనై, పుదుమై పెన్, ఒరు ఖైదీయిన్ డైరీ, ముదల్ మరియాదై, కడలోర కవిదైగళ్, వేదం పుదిదు, కొడిపరక్కుదు, ఎన్‌ఉయిర్‌తోళన్, పుదునెల్లు పుదు నాత్తు, నాడోడితెండ్రల్, కెప్టెన్ మగళ్, కిళక్కు సీమయిలే, కరుత్తమ్మ, పసుమ్‌పెన్, తమిళ్‌సెల్వన్, తాజమహాల్ వంటి పలు చిత్రాలు భారతీరాజా కేరీర్‌లో మైలు రాయిగా నిలిచిపోయారు. నటీనటులు, దర్శకులు కే.భాగ్యరాజ్,రాధిక, రాధ, రేవతి, రంజిత, మణివన్నన్, మనోబాలా, నెపోలియన్, సుధాకర్, పాండియన్, నిళల్‌గళ్ రవి, పొన్‌వన్నన్, జనకరాజ్, నటి వడివుక్కరసి, అరుణ, విజయశాంతి, రేఖ, ఉషా, గౌండమణి,కార్తీక్, త్యాగరాజన్ వంటి వారందర్నీ పరిచయంచేసింది భారతీ రాజయే కావడం విశేషం. తన వారసుడు మనోజ్‌ను హీరోగా పరిచయం చేసి తాజ్‌మహాల్ అనే ప్రేమ కథా చిత్రాన్ని చేశారు.


