ధనుస్కోడి తీరం
సాక్షి, చైన్నె: సుమారు రూ. 733 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రామేశ్వరం – ధనుస్కోడి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీవీకే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందా..? అని రైల్వే అధికారులు ఎదురు చూస్తున్నారు.
చారిత్రక నేపథ్యం ఇదీ..
బ్రిటిష్ పాలన కాలంలో, 1914 ఫిబ్రవరి 24న చైన్నె ఎగ్మూర్ నుండి ధనుస్కోడికి ప్రతిష్టాత్మకమైన బోట్ మెయిల్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ధనుస్కోడి నుండి శ్రీలంకలోని తలైమన్నార్‌కు ప్రయాణికుల నౌకల సేవలు కూడా నడిచేవి. ఈ సేవలు భారతదేశం–శ్రీలంక మధ్య రవాణాకు అత్యంత కీలకమైన మార్గంగా ఉండేవి. ఈ రైలు సర్వీస్ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవ) సంవత్సరంలో, అంటే 1964 డిసెంబర్ 22న సంభవించిన ఘోర తుపాను ధనుస్కోడిని పూర్తిగా అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి వైపరీత్యంలో రైల్వే స్టేషన్, రేవులో ఉన్న వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ధనుస్కోడికి వెళ్తున్న బోట్ మెయిల్ రైలు కూడా సముద్ర అలల ధాటికి కొట్టుకుపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న 200 మందికి పైగా ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఈ తుపాను దెబ్బకు రామేశ్వరం – ధనుస్కోడి మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైపోయింది.
55 ఏళ్ల అనంతరం దృష్టి..
తుపానుతో అతలాకుతమైన 55 ఏళ్ల తర్వాత, రైల్వే మంత్రిత్వ శాఖ రామేశ్వరం నుండి ధనుస్కోడి వరకు 17.20 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించింది.దీనికి సంబంధించిన సర్వే పనులను పూర్తి చేసి, 2019 మార్చి 1న కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మొదట ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 208 కోట్లుగా నిర్ణయించారు. అయితే మద్రాసు ఐఐటీ ఇంజనీర్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించి కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో వచ్చే తుఫానులు, సముద్రపు గాలులు, వరదల నుండి రైల్వే లైన్‌ను రక్షించాలంటే ట్రాక్‌ను రోడ్డు మట్టం కంటే ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారు. 1964లో తుఫాను వచ్చినప్పుడు పాత ట్రాక్ రోడ్డు మట్టం కంటే ఒక మీటరు లోపే ఉండటం వల్లే అది త్వరగా కొట్టుకుపోయిందని గుర్తుచేశారు. ఈ భద్రతా ప్రమాణాల మార్పుల కారణంగా ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 208 కోట్ల నుండి ఏకంగా రూ. 733 కోట్లకు పెరిగింది.
ఏడేళ్లుగా మూలనపడ్డ ప్రాజెక్ట్
గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. రామేశ్వరం – ధనుస్కోడి ప్రాంతం పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం అని, ఇక్కడ కొత్త రైల్వే లైన్ నిర్మిస్తే తీరప్రాంత పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని గత ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. దీనివలన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ఏడేళ్లు దాటినా ఈ ప్రాజెక్ట్ ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయింది.
ధనుస్కోడి పాత రైల్వే స్టేషన్
దశాబ్దాల కల..
ప్రస్తుతం తమిళనాడులో అధికార మార్పు నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాయి. తాజా ప్రభుత్వం సహకరించేనా అన్న భావనలో పడ్డారు. తాజాగా 17.20 కిలోమీటర్లు సింగిల్ లైన్ బ్రాడ్ గేజ్ – విద్యుద్దీకరణతో కూడిన ట్రాక్ ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే జటాయు తీర్థం, కోదండరామర్ కోవిల్, ముకుందరాయర్ చతిరంలో రైల్వే స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. పాత రైల్వే లైన్ పరిధిలోని 28.6 హెక్టార్ల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉంది. ఇది కాకుండా 43.81 హెక్టార్ల రాష్ట్ర ప్రభుత్వ భూమి, 3.66 హెక్టార్ల ప్రైవేట్ భూమిని సేకరించాల్సి ఉంది.పర్యావరణ సాకులతో గత డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, ఇప్పుడు తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీవీకే ప్రభుత్వం గనుక పూర్తి స్థాయిలో సహకరించి, భూసేకరణకు మద్దతు ఇస్తే.. దశాబ్దాల కాలంగా కలగా మిగిలిపోయిన రామేశ్వరం – ధనుష్కోడి రైల్వే లైన్ పనులను వెంటనే ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం రామేశ్వరం వరకు వివిధ నగరాల నుంచి రైలు సేవలు సాగుతున్న విషయం తెలిసిందే.


