భారతీరాజా నెరవేరని కోరిక.. | - | Sakshi
Sakshi News home page

భారతీరాజా నెరవేరని కోరిక..

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

సొంత ఊరిలో

బంధువుల కన్నీటి పర్యంతం!

సాక్షి,చైన్నె: తన బంధువులందరినీ ఒకే చోటికి పిలిచి, పెద్ద విందు ఏర్పాటు చేసి అందరితో కలిసి సంతోషంగా గడపాలని భారతీరాజా ఆశపడ్డారని, అయితే, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారంటూ బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తేని జిల్లాలోని అల్లి నగరం (కీరైకల్‌ స్ట్రీట్‌)లో భారతీ రాజ తల్లిదండ్రులు పెరియమాయ దేవార్‌, కరుత్తమ్మ నివసించే వారు. భారతీరాజా తోబుట్టువులైన చెల్లెలు భారతి తన అన్నయ్యను గుర్తుచేసుకుంటూ రోదిస్తున్నారు. ‘అన్నయ్యకు తాను అంటే చాలా ఇష్టమని, అందుకే తన అసలు పేరైన చిన్నస్వామిని మార్చుకుని.. తన పేరులోని మొదటి ముక్కను (భారతి), అన్నయ్య జయరాజ్‌ పేరులోని రెండో ముక్కను (రాజా) కలిపి ’భారతీరాజా’ అని పేరు మార్చుకున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం, నాటకాలు వేయడం ఆయనకు అలవాటు‘ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కుమారుడి మరణం.. గుండెకోత

ఆయన బంధువులు సుబ్బురాజ్‌, రవి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన సొంత ఊరికి, తను చిన్నప్పుడు పెరిగిన ఇంటికి తరచూ వచ్చేవారన్నారు. గతంలో కంబమ్‌ ప్రాంతంలో జరిగిన ఒక కుటుంబ వేడుకకు వచ్చినప్పుడు బంధువులందరినీ చూసి ఎంతో సంబరపడ్డారని పేర్కొన్నారు. సొంత వాళ్లందర్నీ పిలిచి ఒక పెద్ద విందు ఇవ్వాలని ఎప్పుడూ అనేవారని, కుమారుడు మనోజ్‌ మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారన్నారు. దాంతో ఆ విందు కోరిక నెరవేరకుండానే నిష్క్రమించారు అని పేర్కొన్నారు.

తోటలోనే అంత్యక్రియలు..

తాను మరణిస్తే తేని జిల్లాలోని దేవదానపట్టి కాట్‌రోడ్‌ పరిసరాల్లో ఉన్న తన సొంత తోటలోనే(ఫామ్‌ హౌస్‌) అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన తరచూ చెప్తుండేవారని, ఆయన చివరి కోరిక మేరకే భౌతికకాయాన్ని తేని జిల్లాకు తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నామని బంధువులు తెలిపారు. తాజాగా భారతీ రాజాతీ అల్లి నగరం లాంటి చిన్న పల్లెటూరులో విషాదం నెలకొంది. బంధువులు, తేని జిల్లా ప్రజలను, ఆయన అభిమానులను తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. ఈరోజు సాయంత్రం తేని బంగళామేడు ప్రాంతంలో జిల్లా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement