సాక్షి, చైన్నె : టీవీకేలో చేరిన అన్నాడీఎంకేకు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదాన్ని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దేశీయ మక్కల్ శక్తి కట్చి అధ్యక్షుడు ఎం.ఎల్. రవి ఈ పిటిషన్ దాఖలు చేశారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు చెందిన 47 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన సీఎం విజయ్ విశ్వాస పరీక్ష తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేకు చెందిన మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమర వేల్,పెరుంతురై ఎమ్మెల్యే జయకుమార్, ఽతారాపురం ఎమ్మెల్యే సత్య భామాలు తొలుత తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో అధికార టీవీకేలో చేరారు. ఆతదుపరి అంబా సముద్రం ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య కూడా రాజీనామా చేసి టీవీకేలో చేరారు. వీరంతా విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకే విప్‌ను ధిక్కరించినట్టుగా ఫిర్యాదు విచారణలో ఉన్న సమయంలో రాజీనామాను స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆగమేఘాలపై ఆమోదించడం చర్చకు దారి తీసింది. అనర్హత వేటు అంశం పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ తాజాగా పిటిషన్ దాఖలైంది. అనర్హత వేటు చర్యల నుండి తప్పించుకోవడానికే ఈ ఎమ్మెల్యేలు రాజీనామా దారి ఎంచుకున్నారని, దాన్ని స్పీకర్ ఆమోదించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, ప్రజల తీర్పును పూర్తిగా అవహేళన చేయడమే అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలాంటి ఫిరాయింపులు, తదుపరి ఉపఎన్నికల వల్ల ప్రభుత్వంపై, ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ధర్మాసనానికి వివరించారు. స్పీకర్ జారీ చేసిన రాజీనామా ఆమోద ఉత్తర్వులను రద్దు చేయాలని, సదరు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. త్వరలో ఈ పిటిషన్ విచారణకు రానుంది.
హైకోర్టు


