తిరువళ్లూరు: విద్యార్థినులు, యువతులకు ఎక్కడైనా వేధింపులు ఉంటే తక్షణం తమకు సమాచారం ఇవ్వాలని సింగపెన్నే టీమ్ ఎస్‌ఐ సుగంతి సూచించారు. మహిళల భద్రత కోసం సీఎం ప్రత్యేక చొరవతో సింగపెన్నే టీమ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి దశలో తిరువళ్లూరు జిల్లాకు గాను ఎస్‌ఐ సుగంతి, మాల ఆధ్వర్యంలో రెండు సింగపెన్నే టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుల్ వుంటారు. వీరు నిత్యం జనసంచార ప్రాంతాల్లో నిఘా వుంచడంతో పాటూ మహిళలకు వేధింపులు ఎదురైనట్టు ఫోన్‌కాల్ వస్తే తక్షణం అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకోకున్నారు. కాగా తిరువళ్లూరులో ఎస్పి వివేకానందశుక్లా ప్రత్యక్ష పర్యవేక్షణలో టీమ్ తమ విధులను నిర్వహించనుంది. కొత్తగా ఏర్పాటైన సింగపెన్నే టీమ్ బుధవారం ఉదయం తిరువళ్లూరు బస్టాండులో గస్తీ నిర్వహించారు. విద్యార్దులతో ముచ్చటించి వారికి బ్యాడ్‌టచ్, గుడ్‌టచ్‌పై అవగాహన కల్పించారు.


