సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే వాళ్లు... ‘రోల్ మోడల్స్’ను ఆదర్శంగా తీసుకోవడం పరిపాటి! కానీ భారత యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ మాత్రం తన అభిమాన ఆటగాడు తానే అని అంటున్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా ఇతర సీనియర్ రెజ్లర్ల వీడియోలకు బదులు తన వీడియోలే చూసి స్ఫూర్తి పొందుతానని చెబుతున్నాడు.
కాగా 2025 జూన్‌లో జరిగిన అండర్–23 ఆసియా చాంపియన్‌షిప్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 65 కేజీల విభాగంలో పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్న సుజీత్... బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.
ఇటీవల కిర్గిస్తాన్ రాజధాని బిష్‌కెక్‌లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన సుజీత్... తనను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో మాత్రం లేనని వెల్లడించాడు.
ఆ వివరాలు అతడి మాటల్లోనే...
‘‘నేను ఎవరినీ అభిమానించను. ఇంకా చెప్పాలంటే నా అభిమాన రెజ్లర్‌ను నేనే. నా వీడియోలే ఎక్కువ చూస్తాను. ఆదివారం మొత్తం అదే పని పెట్టుకుంటా... నా ప్రాక్టీస్ బౌట్‌ల వీడియోలు చూసి స్వీయ విశ్లేషణ చేసుకుంటా. అప్పుడప్పుడూ యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, అమిత్ ధన్‌కర్ వంటి సీనియర్‌ల బౌట్‌లను పరిశీలిస్తా.
వారి వేగం, బలం గమనిస్తా. కానీ ఎక్కువ శాతం మాత్రం నా బౌట్ వీడియోలే చూస్తా. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రాక్టీస్‌కే అధిక సమయం పోతుంది. ఆదివారం మాత్రమే వీలు దొరకుతుంది. అప్పుడు నా బౌట్‌లు చూసి అందులో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటా.
నన్ను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో లేను. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఆ రోజు పోటీలో ఎవరు మెరుగైన ప్రదర్శన కనబర్చారు అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నా వరకైతే ఈ జోరు కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు అందించాలనుకుంటున్నా.
గత రెండేళ్లుగా భారత రెజ్లర్ల చేతిలో ఒక్క బౌట్‌లోనూ ఓడలేదు. కానీ ఆసియా క్రీడల్లో ఇరాన్, జపాన్ రెజ్లర్లతో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. మెరుగవ్వాల్సిన అంశాలపై దృష్టి పెట్టా.
రెజ్లింగ్‌లో డిఫెన్స్‌దే కీలకపాత్ర. నా ప్రధాన బలం కూడా అదే. అటాకింగ్ గేమ్ పెంపొందించుకునేందుకు సాధన చేస్తున్నా. ఓర్పు పెంచుకుంటూ ప్రతిదాడిలో మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నా.
భారత ఫ్రీస్టయిల్ హెడ్ కోచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలోని జాతీయ శిబిరం ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ప్రతి అంశంలో మరింత మెరుగయ్యేందుకు కోచ్‌లు అనునిత్యం సాధన చేయిస్తున్నారు. దాని ఫలితాలు మున్ముందు మీరంతా చూస్తారు.
నా బరువు కేటగిరీ రెజ్లర్లతోనే కాకుండా... నా కంటే ఎక్కువ బరువున్న వారితోనూ సాధన చేస్తున్న. దాని వల్ల శక్తిని పెంపొందించుకోవడంతో పాటు... మరిన్ని మెలకువలు నేర్చుకోవచ్చు.
ఈ ఏడాది ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనున్నాయి. ఆ రెండు నాకు ఎంతో ముఖ్యం. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా క్రీడల్లో వంద శాతం కష్టపడతా. ఇక గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో త్రుటిలో పతకం కోల్పోయా. ఈసారి అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పతకంతో తిరిగి వస్తా.
అండర్–23 విభాగానికి సీనియర్ స్థాయికి పెద్ద తేడా ఏమీ లేదు. అందులోనూ ఇలాంటి పోటీనే ఉంటుంది. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయి అన్నిటికంటే పెద్దది. అక్కడ పోటీ తీవ్రత అధికం. మామూలుగా ఎవరైనా మట్టిలో రెజ్లింగ్ ప్రారంభిస్తారు. కానీ నేను కెరీర్ ప్రారంభం నుంచే మ్యాట్‌పై పోటీపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మా నాన్న నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు.
దాని వల్ల నా డిఫెన్స్ మెరుగైంది.
సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 10–15 సెకన్లు చేసిన చిన్న తప్పిదం వల్ల పతకం దక్కలేదు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక మీదట అలాంటి తప్పులు చేయను.
అభిమానుల ఆదరణ అమోఘం. వారు నా నుంచి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు. తప్పక వారి కోరిక నెరవేరుస్తా. నా వరకైతే నేను పతకాలు సాధించగలనని వంద శాతం నమ్ముతున్నా. కానీ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు కదా!
సంగీతంతో సేదతీరుతా...
రోజులో ఎక్కువ శాతం మ్యాట్‌పై కుస్తీ పట్టడంతోనే సరిపోతుంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం సంగీతం వింటాను. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. అయితే అవన్నీ రెజ్లింగ్ తర్వాతే. కొన్ని సార్లు రిఫ్రెష్ అవడానికి పాటలు ఉపయోగపడతాయి. దేశానికి పతకాలు సాధించాలనే లక్ష్యంతో జీవితంలో ఎన్నో ఇష్టమైన విషయాలను పక్కన పెట్టా.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం చాలా తక్కువ. కెరీర్ కోసం నచ్చిన ఆహారాన్ని కూడా వదులుకున్నా. ఇవన్నీ రెజ్లింగ్ కోసమే. నాన్న దయానంద్ రెజ్లింగ్ కోచ్ కావడంతో ఇంట్లో కూడా ఆటకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఏ క్రీడలోనైనా నిలకడ ముఖ్యం. అదే ఇతరులతో మనల్ని భిన్నంగా చూపుతుంది’’ అని సుజీత్ కల్కల్ పేర్కొన్నాడు.
– సాక్షి క్రీడా విభాగం


