
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చని΄ోయిన తర్వాత, లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండోపెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతోపాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.
ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చని΄ోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతాయి.
అయితే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్ కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కానీ పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్‌లో ఎటువంటి హక్కూ ఉండదు. అయితే అన్ని వేళలా అలా వుండదు.
ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలంటూ చని΄ోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం. అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికీ, మెయింటెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికీ తేడా ఏమీ లేదని అంటూ, భర్త బతికివుండగా మొదటి భార్యకు రావలసివున్న మెయింటెనెన్స్ బకాయిలు కూడా తనకు ఇవ్వాలి అని కోర్టు పేర్కొంది.
మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం పెన్షన్ రూల్స్‌లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుందని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి కాబట్టి కేసు పూర్వాపరాలను బట్టి కొన్ని హక్కులు రెండవ భార్యకూ వర్తిస్తాయా లేదా అన్నది పూర్తిగా ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు చట్టాన్ని ఆశ్రయిస్తే తగిన ఉపశమనం దొరికే ఆస్కారం ఉంది.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)
(చదవండి: Pregnant Women: బీకేర్‌ఫుల్.. మార్నింగ్ సిక్‌నెస్‌ని లైట్ తీసుకోవద్దు!)