
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులను హేతుబద్ధీకరించాలనే వాదనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతంగా ఉన్న శ్లాబ్‌ను పూర్తిగా తొలగించడం అనే కీలక ప్రతిపాదన చర్చలో ఉందని తెలుస్తుంది.
ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ విధించే వస్తువుల్లో చాలా వరకు సాధారణ పౌరులు దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అధికంగా వినియోగించే ఉత్పత్తులు ఈ శ్లాబ్‌లో ఉన్నాయి. కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రణాళికలో భాగంగా ఈ వస్తువులను తక్కువగా 5% పన్ను పరిధిలో వర్గీకరించాలని యోచిస్తోంది. తుది వినియోగదారులకు ఆయా వస్తువులను చౌకగా అందించాలనే లక్ష్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రభుత్వం 12% శ్లాబ్‌ను పూర్తిగా రద్దు చేసి ఆయా వస్తువుల్లో కొన్నింటిని ప్రస్తుతం దాని కంటే తక్కువగా ఉన్న 5% శ్లాబ్, కొన్నింటిని ఎక్కువగా 18% శ్లాబులోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రొటోకాల్ ప్రకారం మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు 15 రోజుల నోటీసు అవసరం. అయితే ఈ నెలాఖరులో సమావేశాలు జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌కు పన్ను రేట్లలో మార్పులను సిఫారసు చేసే అధికారం ఉంది.
ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’
12 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోని వస్తువుల వివరాలు..
ప్రాసెస్డ్ ఫుడ్: పాలు, జున్ను, వెన్న, నెయ్యి, ఫ్రోజెన్ మీట్.
డ్రైఫ్రుట్స్, గింజలు: బాదం, పిస్తా, అంజీర, ఖర్జూరం
నూనెలు: ఫిష్ ఆయిల్, లానోలిన్, పౌల్ట్రీ కొవ్వు.
టెక్స్‌టైల్, దుస్తులు: రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు, సింథటిక్ నూలు
ఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు, కంప్యూటర్ ఉపకరణాలు
ట్రావెల్ & హాస్పిటాలిటీ: బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం, నాన్ ఏసీ హోటళ్లు
నిర్మాణ సామగ్రి: సిరామిక్ టైల్స్, శానిటరీ వేర్