‘కారుణ్యం’ చూపలేక.. మరణమే పలకరించింది

9 years boy who has been ill for four years is deceased - Sakshi

కారుణ్య మరణం కోరేందుకు కోర్టుకు వచ్చి వెళుతుండగా కబళించిన మృత్యువు

నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు

చిత్తూరు జిల్లాలో విషాదం

కన్నబిడ్డ నాలుగేళ్లుగా అనారోగ్యంతో అల్లాడుతుంటే.. ఆ తల్లి తట్టుకోలేకపోయింది. శక్తిమేర వైద్యం చేయించినా.. కుదుటపడని కొడుకుని చూడలేక తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇక బిడ్డను బతికించుకోలేననుకున్న ఆ తల్లి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరేందుకు ప్రయత్నించింది. కోర్టు లేదని తెలిసి కొడుకును ఇంటికి తీసుకెళుతుండగా.. మార్గంమధ్యలోనే కన్నుమూశాడు ఆ తనయుడు. అందరికంట తడిపెట్టించిన ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగింది.

పుంగనూరు: గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెకు చెందిన మణి చౌడేపల్లె మండలం బీర్జేపల్లెకు చెందిన అరుణను వివాహం చేసుకుని బీర్జేపల్లెలో స్థిరపడ్డాడు. బండలు కొట్టి జీవించే ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకొడుకు హర్షవర్ధన్‌ (9) నాలుగో తరగతి చదువుతున్నాడు. మరో కుమారుడు ఎబిలైజర్‌ వయసు ఏడాది. నాలుగేళ్ల కిందట ఒకరోజు హర్షవర్ధన్‌ బడిలో ఆడుకుంటూ పడిపోయాడు. నోటినుంచి, ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. అప్పటి నుంచి తరచుగా అలాగే అవుతుండేది. తల్లిదండ్రులు తిరుపతి, వేలూరు తదితర ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు.

గుర్రంకొండలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మి లక్షలు వెచ్చించినా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. హర్షవర్ధన్‌కు తరచు రక్తస్రావం అవుతోంది. కొడుక్కి వైద్యం చేయించలేకపోతున్నాననే వేదనతో మణి 15 రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో బిడ్డ పడుతున్న వేదన చూసి తట్టుకోలేకపోయిన అరుణ.. అతడికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరాలని నిర్ణయించుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కొడుకును తీసుకుని ఆటోలో మంగళవారం పుంగనూరు కోర్టుకు వచ్చింది. కోర్టుకు సెలవని తెలియడంతో వారంతా అదే ఆటోలో వెనుదిరిగారు. బీర్జేపల్లె వెళ్లకముందే ఆటోలోనే హర్షవర్ధన్‌ తుదిశ్వాస విడిచాడు. కళ్లముందే కన్నపేగు తెగిపోవడంతో ఆ తల్లి రోదన హృదయవిదారకంగా ఉంది.

హర్షవర్ధన్‌ తాత మృతి
గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెలో ఉంటున్న హర్షవర్దన్‌ తాత కె.రెడ్డెప్ప (70) అనారోగ్యంతో సోమవారం తిరుపతి ఆస్పత్రిలో మృతిచెందాడు. ముందురోజు తాత, మరుసటి రోజు మనుమడు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top