breaking news
Washington State University
-
మరో కరోనా మహమ్మారి!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్–19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్–కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → మెర్స్–కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్‌లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్‌కేయూ5 వైరస్‌లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు. → సార్స్–కోవ్–2 అనే వైరస్ కోవిడ్–19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్‌కేయూ5 వైరస్లు స్పైక్ ప్రొటీన్ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు. → చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మైఖేల్ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
Khosta-2: రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్
వాషింగ్టన్: సార్స్–కోవ్–2.. అంటే కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేదు. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. తొలుత చైనాలో పుట్టినట్లు భావిస్తున్న ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. అచ్చంగా కోవిడ్–19 లాంటి వైరస్‌ను రష్యాలోని గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేవని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం రష్యా గబ్బిలాలపై అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఖోట్సా–2 అనే వైరస్‌లో స్పైక్ ప్రొటీన్లను గుర్తించారు. ఇవి మనుషుల్లోని కణాల్లోకి చొచ్చుకుపోయి, విషపూరితం చేస్తాయని తేల్చారు. కరోనా వైరస్లలో (సార్బీకోవైరస్లు) ఖోట్సా–2, సార్స్–కోవిడ్–2 అనేవి ఒకే ఉప కేటగిరీకి చెందినవని పరిశోధకులు చెప్పారు. అధ్యయనం వివరాలను ప్లాస్ పాథోజెన్స్ పత్రికలో ప్రచురించారు. కేవలం సార్స్–కోవ్–2 వంటి వేరియంట్లను నియంత్రించడానికి కాదు, సార్బీకోవైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యూనివర్సల్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్ట్ మైఖేల్ లెట్కో చెప్పారు. ఖోట్సా–2 వైరస్ వ్యాపిస్తే మనుషులకు తీవ్ర అనారోగ్యం ముప్పుందని గుర్తించారు. కోవిడ్–19, ఖోట్సా–2 లాంటి వైరస్లు ప్రొటీన్ స్పైక్‌ల సాయంతో మనుషులపై దాడి చేస్తాయి. -
హరప్పన్లు... వంకాయ కూర!
‘‘వంకాయ వంటి కూరయు... పంకజముఖి సీత వంటి భామామణియున్... శంకరుని వంటి దైవము... లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే’’ వంకాయ వంటి కూర, పద్మం వంటి ముఖం కలిగిన సీత వంటి స్త్రీ, శివుడి లాంటి దేవుడు, లంకాధిపతి రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు లేరన్నది ఈ చాటువు అర్థం. ఇంతకీ ఈ కూర మొట్టమొదట ఎవరు చేశారంటారు? అమ్మమ్మలు, నానమ్మలు వండిపెడితే సుష్టుగా లొట్టలేసుకు తిన్నాం గానీ... ఈ సందేహం మాత్రం ఎప్పుడూ రాలేదు కదా? అరుణిమా కశ్యప్... స్టీవ్ వెబర్, సోయితీ బెనర్జీలకు వచ్చింది. వాళ్ల శోధన... పాకశాస్త్ర ప్రయోగాల పుణ్యమా అని ఇప్పుడు వంకాయ కూర మూలాలు తెలిశాయి. ఆశ్చర్యంగా అనిపించినా... ఈ వంటకం హరప్పన్ కాలం నాటిదట! హరప్పన్లు వంకాయ కూర తినేవారా? మీకెలా తెలుసు? వాళ్లేమైనా ‘కుక్ బుక్’ రాసిపెట్టారా? పోనీ వేదాల్లో ఈ వంటకం ప్రస్తావనేమైనా ఉందా? ఇవేనా మీ బుర్రల్లో మెదులుతున్న ప్రశ్నలు. హరప్పన్లు వంటల పుస్తకాలు రాయలేదుగానీ... వంట వండుకున్న పాత్రలు వదిలారుగా? అవిచాలు... అప్పుడెప్పుడో వాళ్లు ఏం వండుకున్నారో తెలుసుకునేందుకు అంటున్నారు అరుణిమా కశ్యప్, స్టీవ్ వెబర్లు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఈ ఇద్దరు పరిశోధకులు కొన్నేళ్ల క్రితం ఈ ప్రయోగాలు చేపట్టారు. హరప్ప మట్టిపాత్రల అడుగుభాగాలను మైక్రోస్కోపుల సాయంతో నిశితంగా పరిశీలించినప్పుడు... అక్కడి రసాయన అవశేషాలను విశ్లేషించినప్పుడు ఆ కాలంలో వాడిన మసాలాలు, దినుసుల గురించి తెలిసిందట. హరప్ప నాగరికత తవ్వకాలు జరుగుతున్న ఫర్మానా (ప్రస్తుత హర్యానా) ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకాలను పరిశీలించి, పరిశోధన వ్యాసాలను క్షుణ్ణంగా పరిశోధించిన తరువాత వీరిద్దరూ ఆనాటి వంటకం వంకాయదని తేల్చారు. మరి సొయితీ బెనర్జీ ఏం చేశారు? అరుణిమ, స్టీవ్ల మాదిరిగానే ఢిల్లీకి చెందిన ఈ రచయిత్రి కూడా ఆ కాలం నాటి వంటకాన్ని మళ్లీ వండే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా. అరుణిమా, స్టీవ్‌లు పింగాణీ పాత్రలో వండితే... సోయితీ దేశీ స్టైయిల్లో మట్టి కుండలు, కట్టెలపొయ్యి వాడి వంకాయ కూర వండారు. చిత్రమైన విషయమేమిటంటే... హర్యానా ప్రాంతంలో ఇప్పుడు వంకాయ కూర చాలా అరుదుగా మాత్రమే వండుతారట. హరప్పన్ వంకాయ కూర మీ ఇంట్లో వండాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వండేయండి. ఇదిగో రెసిపీ..! కావాల్సిన పదార్థాలు.. లేత వంకాయలు 15, అల్లం... 2 అంగుళాల సైజు, పసుపు కొమ్ము ఒకటి (లేదంటే పావు టేబుల్‌స్పూన్ పసుపు పొడి), జీలకర్ర... అర టేబుల్ స్పూన్, మామిడికాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర రసం పొడి (చెరకు రసాన్ని ఆరబెట్టాక మిగిలే పొడి) లేదా చక్కెర, పబ్రి (హర్యానా ప్రాంతంలో లభిస్తుంది. మనం దీన్ని కొత్తిమీరతో సరిపెట్టుకోవచ్చు), రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రుచికి తగినంత ఉప్పు. వండే విధానం...: లేత వంకాయలను తొడిమల వరకూ నిలువుగా చీల్చి.. వాటిని ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టుకోవాలి. అల్లం + పసుపు కొమ్ము + జీలకర్రలను మరీ మెత్తగా కాకుండా రుబ్బిపెట్టుకోవాలి. ఈ మసాలాను మట్టికుండలో నువ్వుల నూనె వేసి అది వేడెక్కిన తరువాత కలుపుకోవాలి. రెండు నిమిషాల తరువాత వంకాయలు వేయాలి. దాదాపు పది నిమిషాలపాటు వేగనిచ్చి... పచ్చిమామిడికాయల ముక్కలు కలుపుకోవాలి. ఒక కప్పు నీళ్లు, చక్కెర రసం పొడి, ఉప్పు కలిపి వంకాయలు మెత్తబడే వరకూ ఉడకనివ్వాలి. చివరల్లో పబ్రి (మనమైతే కొత్తిమీర) వేసేస్తే హరప్పన్ వంకాయ కూర రెడీ. వేడివేడి సజ్జరొట్టెలతో ఈ కూర మరింత రుచికరంగా ఉంటుందట!