మహిళా దర్శకురాలు కృతిక ఉదయనిధి స్టాలిన్ హిజ్రాలకు ప్రేమికుల రోజు కానుకగా ఒక వీడియో ఆల్బం అందించారు.
పెరంబూర్ : మహిళా దర్శకురాలు కృతిక ఉదయనిధి స్టాలిన్ హిజ్రాలకు ప్రేమికుల రోజు కానుకగా ఒక వీడియో ఆల్బం అందించారు. వడచెన్నై చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అయిన కృతిక ప్రస్తుతం హి జ్రాల జీవన విధానం, వారి సాదకబాధకాలను ఆవిష్కరిస్తూ ఒక వీడియో ఆల్బం రూపొందించారు. 12 మంది హిజ్రాలు నటించిన ఈ ఆల్బంకు సదయై మీరి అనే పేరును నిర్ణయించారు. ఇందుకోసం వివేక్‌వేల్ మురుగన్ రాసిన పాటకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ వీడియో ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల చెన్నైలో నిర్వహించారు. దర్శకుడు పాండిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని సదయై మీరి ఆల్బంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు హిజ్రాలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృతికా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఈ వీడియో ఆల్బంను హిజ్రాలకు కానుకగా అందిస్తున్నానన్నారు. వారు ఆనాదిగా గుర్తింపునకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయని ఆమె తెలిపారు. అలాంటిది హిజ్రాలను పట్టించుకోకపోవడం ఖండించదగ్గ విషయంగా పేర్కొన్నారు. వారు ఎలా జీవించాలన్నది వారినే నిర్ణయించుకోనిద్దాం. అయితే వారికి మనం చేయాల్సింది ఒక్కటే అది ప్రేమను అందించడమే అని కృతిక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమం లో ఉదయనిధిస్టాలిన్, నటుడు కలైయరసన్ పాల్గొన్నారు.